Fenugreek Leaves | మన వంట ఇంటి సామగ్రిలో ఒకటైన మెంతుల గురించి అందరికీ తెలిసిందే. మెంతులను పోపు దినుసులుగా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మెంతులను నీటిలో నానబెట్టి కూడా తాగుతుంటారు. మెంతులు కొందరికి పడవు. ఇవి వికారాన్ని కలగజేస్తాయి. కనుక మెంతులను తినేందుకు చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే మెంతులను తినలేని వారికి మెంతి ఆకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. మెంతి ఆకు మనకు చలికాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఈ సీజన్లో మెంతి ఆకులను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు మెంతి ఆకుల్లో ఉంటాయి. మెంతి ఆకులను నేరుగా కూరగా చేసుకుని లేదా పచ్చడి, పప్పుతో కలిపి తినవచ్చు. మెంతి ఆకులను జ్యూస్‌లా చేసుకుని కూడా 30 ఎంఎల్ మోతాదులో తాగవచ్చు. మెంతి ఆకులను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
మెంతి ఆకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ సి, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. చలికాలంలో మనకు దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వస్తుంటాయి. అయితే మెంతులను తినడం వల్ల ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు మెంతి ఆకులను తింటే త్వరగా వీటి నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతి ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో మనకు వచ్చే జీర్ణ సమస్యలను తగ్గించడంలో మెంతి ఆకులు ఎంతో పనిచేస్తాయి. కనుక ఈ సీజన్లో మెంతి ఆకులను కచ్చితంగా తినాల్సి ఉంటుంది.
మెంతి ఆకుల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, సిలతోపాటు ఇతర మినరల్స్ కూడా మెంతి ఆకుల్లో సమృద్ధిగా ఉంటాయి. మెంతి ఆకుల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. చలికాలంలో మన చర్మం పగులుతుంది. అయితే మెంతి ఆకులను తింటే చర్మం పగలకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా, తేమగా ఉంటుంది. మెంతి ఆకులను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సైతం తగ్గించుకోవచ్చు. ఈ ఆకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. మెంతి ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. షుగర్ ఉన్నవారికి ఈ ఆకులు వరమనే చెప్పవచ్చు.
మెంతి ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే గొంతు నొప్పి, గొంతు సమస్యలు తగ్గుతాయి. అలాగే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. జలుబు నుంచి కూడా ఉపమశనం పొందవచ్చు. చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మెంతి ఆకులను తింటే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. చలికాలంలో సహజంగానే శిరోజాల సమస్యలు వస్తుంటాయి. వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. అలాగే చుండ్రు ఇబ్బందులకు గురి చేస్తుంది. కానీ మెంతి ఆకులను తినడం వల్ల ఐరన్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి శిరోజాలు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టును కాంతివంతంగా మారుస్తాయి, జుట్టు పెరిగేలా చేస్తాయి. దీంతోపాటు చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా మెంతి ఆకుల వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.