Fennel And Carom Seeds Water | భారతీయుల వంటగదుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక దినుసులు ఉంటాయి. సోంపు, వాము ఇవి రెండు కూడా వాటిలో భాగమనే చెప్పవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఇవి రెండు కూడా అద్భుతంగా పని చేస్తాయి, భిన్న మార్గాల్లో పనిచేస్తాయి. చాలా మంది వీటిని వంటల్లో వాడడంతో పాటు వీటితో నీటిని తయారుచేసుకుని తాగుతూ ఉంటారు. వాము నీరు, సోంపు నీరు రెండూ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటి ప్రయోజనాలను తెలుసుకోవడం వల్ల మన శరీర అవసరాలకు ఏది సరైనదో నిర్దారించుకోవచ్చు. వాము నీరు, సోంపు నీరు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను తెలుసుకుందాం.
సోంపు నీరు దాని శీతలీకరణ లక్షణాలకు, రుచికి ప్రసిద్ది చెందింది. కనుక పిల్లలు కూడా దీనిని ఇష్టపడతారు. ఈ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సడలించబడుతుంది. ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలతో బాధపడే వారు సోంపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఆహారం సమర్థవంతంగా విచ్చినం చేయబడుతుంది. భారీ భోజనం చేసిన తరువాత గుండెల్లో మంట, ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో సోంపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ నీటిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి లేదా గ్లాస్ నీటిలో సోంపు గింజలు వేసి బాగా మరిగించిన తరువాత కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా సోంపు నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు కలుగుతుంది.
వాము నీరు బలమైన, ఘాటు రుచిని కలిగి ఉంటుంది. ఇది దాని వెచ్చని స్వభావానికి ప్రసిద్ది చెందింది. వాములో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. జీర్ణక్రియను ఉత్తేజపరచడంతో పాటు అజీర్ణం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. గ్యాస్, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో వాము నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పేగు కదలికలను సంక్రియం చేయడంలో, పేగు కదలికలను మెరుగుపరచడంలో ఈ నీరు మనకు సహాయపడుతుంది. జీర్ణక్రియ మందగించడం, ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడే వారు ఈ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ నీటిని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వాము వేసి బాగా మరగించాలి. తరువాత వడకట్టి గోరువెచ్చగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఇక ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలి అనే విషయానికి వస్తే ఆమ్లత్వం, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడే వారు సోంపు నీటిని తీసుకోవాలి. జీర్ణక్రియ నెమ్మదించడం, గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు వాము నీటిని ఎంచుకోవాలి. కొందరు తమ జీర్ణ అవసరాలను బట్టి రెండింటినీ ఎంచుకోవచ్చు. అయితే జీర్ణసమస్యలు మరీ ఎక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోవడానికి బదులుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే వీటిని మితంగా తీసుకున్నప్పుడే మనకు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు.