Artificial Sweeteners | కృత్రిమ స్వీటెనర్లను చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలుగా చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలని కోరుకునేవారు, మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలనుకునేవారు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. కృత్రిమ స్వీటెనర్ల వినియోగం టైప్-2 మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యల ముప్పుతో సంబంధం కలిగి ఉంటుందని పరిశోధన సూచించింది. ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ మెటా-విశ్లేషణలో అమెరికా, యూరప్, జపాన్‌కు చెందిన సుమారు 7.2 లక్షల మంది పెద్దల సమాచారాన్ని పరిశీలించారు. ఇందులో ఆరు వేర్వేరు అధ్యయనాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ముఖ్యంగా కృత్రిమ స్వీటెనర్లను పదేళ్లకు పైగా తీసుకున్నవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 31 శాతం అధికంగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.
కృత్రిమ స్వీటెనర్లను తక్కువ క్యాలరీలు కలిగిన చక్కెర ప్రత్యామ్నాయాలుగా ఉపయోగిస్తారు. ఇవి డైట్ డ్రింక్స్, షుగర్-ఫ్రీ పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొన్ని పాల ఉత్పత్తుల్లో కూడా ఉంటాయి. అందువల్ల తాము తీసుకునే ఆహారంలో కృత్రిమ స్వీటెనర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఉత్పత్తుల లేబుళ్లను పరిశీలించడం అవసరం. మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చక్కెర వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ స్వీటెనర్లను ఎంచుకుంటారు. అయితే వీటిని ఎక్కువకాలం తీసుకోవడం వల్ల శరీరంలోని జీవక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై మరింత క్లినికల్ పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ స్వీటెనర్ల అధిక వినియోగం పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యతను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గట్ మైక్రోబయోమ్‌లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. శరీరంలోని సాధారణ జీవక్రియ ప్రక్రియలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వైవిధ్యం తగ్గడం వల్ల శరీరంలో స్వల్పస్థాయి వాపు లేదా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు దారితీసి మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ముప్పును పెంచే అవకాశం ఉంటుంది. కృత్రిమ స్వీటెనర్లు ఆకలి, ఆహారం తీసుకోవాలనే కోరికను నియంత్రించే శరీర వ్యవస్థలపై కూడా ప్రభావం చూపిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆకలి, శక్తి వినియోగాన్ని నియంత్రించడంలో ఘ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి సంకేతాల్లో మార్పులు ఆహార ఎంపికలు, ఆకలి స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే శరీరంలోని సాధారణ జీవక్రియ పనితీరులో ఏర్పడే సమస్య. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలు, నడుము చుట్టుకొలత, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అంశాలు ప్రభావితమవుతాయి. ఈ పరిస్థితి ఉన్నవారిలో టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే కృత్రిమ స్వీటెనర్లు నేరుగా మధుమేహానికి కారణమవుతాయని ఈ అధ్యయనం నిరూపించలేదు. పరిశోధనలో కృత్రిమ స్వీటెనర్ల వినియోగం, టైప్-2 మధుమేహం మధ్య సంబంధం ఉన్నట్లు మాత్రమే గుర్తించారు. పరిశీలనాత్మక అధ్యయనాలు కావడంతో ఇతర జీవనశైలి అంశాల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కృత్రిమ స్వీటెనర్లు నేరుగా వ్యాధులకు కారణమవుతాయని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.
ముఖ్యంగా ప్రీడయాబెటిస్ ఉన్నవారు, ఊబకాయంతో బాధపడేవారు, మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారు, రోజూ పెద్ద మొత్తంలో డైట్ డ్రింక్స్ తీసుకునేవారు కృత్రిమ స్వీటెనర్ల వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాలి. చక్కెర వినియోగాన్ని తగ్గించేందుకు కృత్రిమ స్వీటెనర్లపై పూర్తిగా ఆధారపడకుండా సహజమైన మార్గాలను ప్రయత్నించవచ్చు. పండ్లను పూర్తిగా తీసుకోవడం, రుచికోసం దాల్చిన చెక్కను ఉపయోగించడం, చక్కెర లేని పెరుగు తీసుకోవడం, రోజువారీ ఆహారంలో చక్కెర పరిమాణాన్ని క్రమంగా తగ్గించడం, చక్కెర కలిపిన పానీయాలకు బదులుగా నీటిని తీసుకోవడం వంటి మార్గాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్జూరాలను కూడా పరిమితంగా తీసుకోవచ్చు. స్టీవియాను కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించడం వల్ల క్యాలరీలు తగ్గే ప్రయోజనం ఉన్నప్పటికీ, వాటిని అధికంగా లేదా దీర్ఘకాలం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై మరింత అవగాహన అవసరం. ముఖ్యంగా మధుమేహం లేదా జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో కృత్రిమ స్వీటెనర్ల పరిమాణాన్ని నియంత్రించుకోవడం మంచిది.