Heart Problems | ఆదివారం జరిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అసోంకు చెందిన ఓ 34 ఏండ్ల యువకుడు బిటు గొగోయ్ గుండెపోటుతో మృతిచెందాడు. శివసాగర్ పట్టణంలోని సినిమా థియేటర్లో బిగ్ స్క్రీన్‌పై మృతుడు క్రికెట్ వీక్షించాడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరి ఓవర్లో భారత జట్టు సిక్స్‌లు కొడుతూ విజయానికి చేరువవుతుండగా గొగోయ్ బిగ్గరగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సినిమా హాల్లో పెద్ద శబ్ధాల మధ్య క్రికెట్ చూడటం వల్లనే గొగోయ్‌కు గుండె పోటు వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు.
అయితే, అతిగా ఉత్సాహం ప్రదర్శించడం, భావోద్వేగానికి గురవడం వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, స్ట్రోక్‌తో పాటు ఇతర ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితులను ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. మన శరీరం ఒత్తిడి లేదా భయం భావాలకు ప్రతిస్పందించే విధంగానే.. ఉత్సాహానికి ప్రతిస్పందిస్తుంది. ప్రధానంగా ఆడ్రినలిన్, నోరాడ్రినలిన్ అనే హార్మోన్లను విడుదల చేయడం ద్వారా మనలో ఆకస్మిక ఉత్సాహం లేదా ఒత్తిడి కలుగుతుంది. దీంతో గుండె ధమనుల లోపల ప్లేక్ దెబ్బతినడం లేదా బ్లాక్ అవడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ ప్లేక్స్ ఎలాంటి ప్రారంభ సంకేతాలు ఇవ్వకుండానే సైలెంట్ కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకేసారి భారీ షాక్ రావడంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ధమనుల్లోని ప్లేక్స్పై ప్రభావం చూపుతుంది. తద్వారా గుండెలో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు రావడం, మెదడులో స్ట్రోక్ రావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. గుండెపోటు రావడంలో ప్రధాన కారణంగా రక్తంలోని అడ్రినలిన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల రోజులో ఎక్కువసార్లు ఆకస్మిక గుండెపోటు వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు గురైన సందర్భాల్లో గుండె కొట్టుకోవడం, శ్వాస ఆకస్మికంగా ఆగిపోతుంది. గుండె విద్యుత్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడి రక్తం పంపింగ్ పనికి అంతరాయం కలుగుతుంది. అప్పుడు శరీరానికి రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ఈ సమయంలో తక్షణ చికిత్స అందనిపక్షంలో చనిపోయే అవకాశాలుంటాయి. కార్డియాక్ అరెస్ట్ గురైన వ్యక్తులు స్పృహ కోల్పోవడం, ఛాతీభాగంలో అసౌకర్యంగా ఉండటం, శరీరం ఒకేసారి బలహీనంగా మారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.