Excessive Sugar Consumption Symptoms | ఏ ఆహారాన్ని కూడా మనం అతిగా తినరాదు. అతిగా తినడం వల్ల ఔషధం కూడా విషంగా మారుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో బయటి తిండి అతిగా తింటున్నారు. జంక్ ఫుడ్‌కు అలవాటు పడి వాటిని లాగించేస్తున్నారు. కొందరు ప్రతి రోజూ జంక్ ఫుడ్‌ను తింటుంటే మరికొందరు వారంలో 2 లేదా 3 రోజుల పాటు ఇదే ఫుడ్‌ను తింటున్నారు. బయట లభించే ఆహారాలు కాస్త రుచిగానే ఉంటాయి కనుక మరింత ఎక్కువ ఆహారాన్ని లాగించేస్తుంటారు. ఇక ఇదే జాబితాలో స్వీట్లు కూడా ఉంటాయి. స్వీట్లు అన్నా చాలా మందికి ఎంతో ఇష్టంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే తమకు నచ్చిన స్వీట్లను అయితే మరీ ఎక్కువగా లాగించేస్తారు. అయితే చక్కెర ఎక్కువ తినడం మంచిది కాదని, ఇది మనకు అనేక విధాలుగా హాని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం మీరు చక్కెరను ఎక్కువగానే తింటున్నట్లు అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు. ఇక ఆ లక్షణాలు ఏమిటంటే..
ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ ఇంకా శక్తి లేనట్లుగా నీరసంగానే ఉంటే అప్పుడు మీరు చక్కెర లేదా పిండి పదార్థాలను ఎక్కువగా తింటున్నట్లు భావించాలి. ఈ విధంగా జరిగితే మీలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. డయాబెటిస్ వస్తుంది. దీంతో ఆహారం తిన్నా కూడా శరీర కణాలకు అందదు. ఫలితంగా ఎంత తిన్నా కూడా ఇంకా నీరసంగానే శక్తి లేనట్లు అనిపిస్తుంది. కనుక మీకు ఇలా అవుతుంటే మీరు చక్కెర లేదా పిండి పదార్థాలను ఎక్కువగా తింటున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. అలా తింటుంటే వెంటనే వాటిని తినడం తగ్గించండి. లేదంటే డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఇక తీపి పదార్థాలను అధికంగా తినే వారికి ఆ యావ ఎక్కువగా ఉంటుంది. పదే పదే తీపి తినాలనిపిస్తుంది. ఇలా జరుగుతున్నా కూడా మీరు చక్కెరను ఎక్కువగా తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. లేదంటే నష్టం జరుగుతుంది.
అధికంగా బరువు పెరగడం కూడా చక్కెర ఎక్కువ తింటున్నారనడానికి సంకేతంగా చెప్పవచ్చు. మీరు ఉన్నట్లుండి సడెన్‌గా బరువు పెరిగితే మీ ఆహారంలో చక్కెర లేదా పిండి పదార్థాలు ఎక్కువగా చేరుతున్నాయేమో గమనించండి. అలా గనక జరిగితే డైట్‌ను కంట్రోల్ చేయండి. ఆయా ఆహారాలను తక్కువగా తీసుకునేందుకు లేదా పూర్తిగా మానేసేందుకు ప్రయత్నించండి. దీంతో బరువు తగ్గుతారు. ఫలితంగా చక్కెర లేదా పిండి పదార్థాలను తినాలనే యావ తగ్గుతుంది. చక్కెర లేదా పిండి పదార్థాలను ఎక్కువగా తినే వారికి తరచూ దురదలు వస్తుంటాయి. చర్మం రంగు మారుతుంది. కొందరికి గజ్జి కూడా వస్తుంది. అలాగే చర్మం పగిలినట్లు అవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నా కూడా మీరు చక్కెరను అధికంగా తింటున్నట్లు అర్థం చేసుకోవాలి.
చక్కెర లేదా పిండి పదార్థాలను అధికంగా తినేవారికి మూడ్ కూడా సరిగ్గా ఉండదు. ఎల్లప్పుడూ ఏదో కోల్పోయిన భావనలో ఉంటారు. అలాగే మూడ్ మారుతుంటుంది. ఆందోళన, కంగారు, చిరాకు ఉంటాయి. ఈ లక్షణాలు గనక ఉంటే మీరు చక్కెరను అధికంగా తింటున్నట్లు అర్థం చేసుకోవాలి. చక్కెర లేదా పిండి పదార్థాలను అధికంగా తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థపై సైతం ప్రభావం పడుతుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. మీరు చక్కెర లేదా పిండి పదార్థాలను ఎక్కువగా తింటున్నట్లు తెలుసుకోండి. ఆ పదార్థాలను తినడం తగ్గించండి. లేదా పూర్తిగా మానేయండి. బదులుగా తాజా పండ్లు లేదా కూరగాయలు, ఆకుకూరలను తినండి. దీంతో ఈ లక్షణాలన్నీ దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.