NAFLD | ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలువురు పలు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో కాలేయ సంబంధిత సమస్యలు ఒకటి. ఇందుకు సంబంధించిన షాకింగ్ డేటాను కేంద్రమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతి మూడో వ్యక్తికి ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మధుమేహం, ఇతర జీవక్రియల రుగ్మతలతో వచ్చే ఈ వ్యాధి ప్రమాదం మద్యం తాగని వారిలోనూ వేగంగా పెరుగుతుదన్నారు. పాశ్చాత్య దేశాలు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేసులు చాలా వరకు ఊబకాయుల్లో కనిపిస్తున్నాయన్నారు. అయితే, భారతదేశంలో ఊబకాయం
లేనివారిలో 20శాతం మంది కూడా బాధితులుగా మారారన్నారు. ఈ కాలేయ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన, ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీస్తుంది. లివర్ సిర్రోసిస్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ప్రసంగంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కాలేయ సిర్రోసిస్ నుంచి కాలేయ క్యాన్సర్ వరకు తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించి.. చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండురకాలు ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కు జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య తక్కువ ఆల్కహాల్ తాగే.. అసలు తాగని వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య కారణంగా కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దాంతో సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ఎన్ఏఎఫ్ఎల్డీ కేసులు తరుచుగా కనిపిస్తాయి. కాలేయంలో కొవ్వు ఏర్పడటానికి కారణం ఏమిటో నిపుణులకు ఖచ్చితంగా తెలియదు. జీవనశైలిలోని మార్పులు ప్రమాదాన్ని పెంచుతాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రారంభ దశలో సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించవు.
అయితే, కాలక్రమేణా అలసట, బాగా అనిపించకపోవడం, కడుపు ఎగువ కుడి భాగంలో నొప్పి, అసౌకర్యం కలిగే సమస్య కనిపిస్తుంది. వ్యాధి ముదిరే కొద్దీ చర్మం దురద, పొట్ట వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్ల వాపు.. తరుచుగా కామెర్లు రావడం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండడం అవసరం.తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధులను నివారించేందుకు బరువును అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆల్కహాల్, చక్కెర, ఉప్పు తీసుకోవడం తగ్గించండి. సోడా, స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లు, ఇతర తీపి పానీయాలు మితిమీరి తీసుకోవడంతో ఫ్యాటీ లివర్ బాధితులుగా మారే అవకాశాలుంటాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. కాలేయ సంబంధిత వ్యాధులను నివారించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.