Eucalyptus Oil | రహదారుల పక్కన మనకు కొన్ని చోట్ల యూకలిప్టస్ చెట్లు కనిపిస్తుంటాయి. వీటినే నీలగిరి చెట్లు అంటారు. వీటిని చాలా మంది చూసే ఉంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఈ చెట్టు ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. నీలగిరి ఆకులను ఎండబెట్టి దాంతో నూనె తీస్తారు. దీన్నే నీలగిరి తైలం అంటారు. ఇది అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు రకాల ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. నీలగిరి తైలం వల్ల పలు రకాల వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నీలగిరి తైలం శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, సైనస్ ఉన్నవారికి ఈ తైలం ఎంతో మేలు చేస్తుంది.
ఆస్తమా, సైనస్ ఉన్నవారు యూకలిప్టస్ ఆయిల్‌ను వేడి నీటిలో వేసి అనంతరం వచ్చే ఆవిరిని బాగా వాసన పీల్చాలి. దీంతో కఫం కరిగిపోతుంది. గొంతు, ఊపిరితిత్తులు, ముక్కు, శ్వాస నాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దీని వల్ల గాలి సరిగ్గా లభిస్తుంది. ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది. అలాగే ఆస్తమా, సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి సమస్యలకు కూడా ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్‌ను టూత్ పేస్ట్‌ల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇది నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంతాలు, చిగుళ్లను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను తీసుకుని నీటిలో వేసి కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి. యూకలిప్టస్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల యూకలిప్టస్ ఆయిల్ కలిపిన నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.
యూకలిప్టస్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల ఛాతి, గొంతు సమస్యలు తగ్గుతాయి. ఈ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని ఛాతి, గొంతుకు రాసి మర్దనా చేయాలి. దీని వల్ల గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గిపోతాయి. యూకలిప్టస్ ఆయిల్‌ను తరచూ వాసన చూస్తున్నా కూడా జలుబు, ముక్కు దిబ్బడ నుంచి బయట పడవచ్చు. ఈ ఆయిల్ దోమలను తరిమికొట్టే మస్కిటో రీపెల్లెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఈ ఆయిల్‌ను తీసుకుని నీటితో కలిపి ఒక బాటిల్ లో పోసి దోమలు ఉండే చోట స్ప్రే చేస్తుండాలి. దీంతో దోమలు పారిపోతాయి. యూకలిప్టస్ ఆయిల్ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. ఈ ఆకులను పేస్ట్‌లా చేసి రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ అవకుండా చూసుకోవచ్చు.
కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు యూకలిప్టస్ ఆయిల్‌ను వాడుతుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ నూనెతో మర్దనా చేస్తే కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ ఆయిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక ఈ నూనెతో తరచూ మర్దనా చేస్తుంటే నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. యూకలిప్టస్ మొక్క ఆకులను నీటిలో వేసి మరిగించి అనంతరం వచ్చే ఆవిరిని వాసన పీలుస్తున్నా కూడా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. యూకలిప్టస్ ఆకులను మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఈ ఆకులు, నూనె మనకు ఎంతో మేలు చేస్తాయి.