Bamboo Shoots | వెదురు పిలకలను (బాంబూ షూట్స్) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)కి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. వారు పలు సమీక్షా అధ్యయనాలు, మానవులపై నిర్వహించిన పరీక్షలు, ప్రయోగ శాలల్లో మానవ కణాలపై చేసిన పరిశోధనల ఫలితాలను ఒకేచోట విశ్లేషించి ఓ అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో ఆ అధ్యయనం ప్రకారం వెదురు పిలకలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడం, పేగుల ఆరోగ్యం మెరుగుపడటం, శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్) తగ్గడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని తేల్చారు. వెదురు పిలకల్లో అనేక పోషకాలు ఉంటాయని అందువల్లే వాటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు.
ఆసియాలోని అనేక దేశాల్లో ఇప్పటికే అనేక వర్గాలకు చెందిన వారు కొన్ని వందల ఏళ్ల నుంచి తమ వంటకాల్లో వెదురు పిలకలను ఉపయోగిస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పోషకాహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా సైంటిస్టులు చేపట్టిన సదరు అధ్యయనానికి చెందిన ఫలితాలను Advances in Bamboo Science అనే జర్నల్లో ప్రచురించారు. ఆ వివరాల ప్రకారం వెదురు పిలకల్లో అనేక పోషకాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిపై అత్యంత వేగంగా పెరిగే మొక్కగా వెదురు పేరుగాంచగా, దీని పిలకల్లో ప్రోటీన్లు అధికంగా, కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్ మితంగా ఉంటుంది. అలాగే అమైనో ఆమ్లాలు, పొటాషియం, సెలీనియం, విటమిన్ ఎ, బి6, ఇ, థయామిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు కూడా వెదురు పిలకల్లో ఉంటాయని తేల్చారు.
ఈ సందర్భంగా ARU పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ లీ స్మిత్ మాట్లాడుతూ ఆసియా దేశాల్లో వెదరు పిలకలు ఇప్పటికే సాధారణ ఆహారంగా ఉన్నాయని అన్నారు. సరైన విధంగా వండితే వీటి రుచి అద్భుతంగా ఉంటుందని, వీటిని వండుకుని తినడం వల్ల పర్యావరణానికి సైతం ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే శక్తి వీటికి ఉందని అన్నారు. మానవులపై జరిగిన పరిమిత అధ్యయనాల్లో వెదురు పిలకలు రక్తంలో చక్కెర నియంత్రణ, కొవ్వు స్థాయిల తగ్గుదలలో సహాయపడినట్లు తెలిపారు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడిందని గుర్తించినట్లు వివరించారు. అలాగే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు పెరిగినట్లు కూడా తేలిందని అన్నారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో అధ్యయనాలు జరిగాయని, కానీ పూర్తి స్థాయిలో ఇంకా నాణ్యమైన పరిశోధనలు జరిగితే అప్పుడు వెదురు పిలకలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసే అవకాశాలు ఉంటాయని అన్నారు.