Milk | పాలు.. అద్భుతమైన పౌష్టికాహారం. చిన్నప్పటి నుంచీ తాగుతూనే ఉంటాం. ఎక్కువగా ఆవు, గేదె, మేక పాలను తీసుకుంటాం. అయితే, వీటిలో ఏ పాలు మంచివి? అనేవిషయంలో ఇప్పటికీ అయోమయమే! ఈ విషయంపై ఆయుర్వేద నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఏ పాలలో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో వివరిస్తున్నారు.
శిశువుకు తల్లి పాలే ఉత్తమం. ఆ తర్వాతి స్థానం ఆవు పాలదేనని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. కొవ్వు తక్కువగా ఉండే ఆవుపాలు.. జీర్ణక్రియకు మంచివి. నవజాత శిశువులకూ ఇట్టే జీర్ణమవుతాయి. గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దాంతో అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే, చిన్నారులకు ఆవుపాలు తాగించడమే మంచిది. ఆవు పాల తర్వాత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించేవి.. మేక పాలు. ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతాయి. మేక పాలు తాగడం వల్ల టీబీ, డెంగ్యూ, కొన్నిరకాల పేగు వ్యాధుల నుంచీ ఉపశమనం లభిస్తుంది. మేక పాలు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. కీళ్లనొప్పులతోపాటు ఆర్థరైటిస్ నొప్పుల నుంచీ బయటపడేస్తాయి. ఇక కొవ్వు అధికంగా ఉండే గేదె పాలు.. శరీర ఎదుగుదలకు, శరీరంలో మాంసం, కొవ్వు అభివృద్ధికి మేలు చేస్తాయి. శరీర బలాన్ని పెంచుతాయి.