Lemon Tea | నిమ్మకాయలు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. నిమ్మరసాన్ని మనం తరచూ వాడుతూనే ఉంటాం. నిమ్మకాయలను వంటల తయారీతోపాటు పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. నిమ్మ నుంచి వచ్చే వాసనను పీలిస్తే తాజాదనపు అనుభూతి కలుగుతుంది. మెదడు ఉత్తేజం చెందుతుంది. రిలాక్స్ అవుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. అయితే రోజూ టీ, కాఫీలను తాగేవారు వాటికి బదులుగా నిమ్మకాయలతో చేసే లెమన్ టీ తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ టీ డికాషన్లోనే నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు వేసి చేస్తే అది లెమన్ టీ అవుతుంది. దీన్ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే లెమన్ టీలో కేవలం తేనె మాత్రమే కలపాలి. ఎట్టి పరిస్థితిలోనూ చక్కెర కలపకూడదు. లేదంటే మనకు ఎలాంటి లాభాలు కలగవు. ఇక లెమన్ టీని రోజూ సేవిస్తే అనేక లాభాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
నిమ్మకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ లెమన్ టీని సేవిస్తుంటే నిమ్మలో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సడెంట్గా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. దీంతో శరీరం దగ్గు, జలుబు, ఫ్లూ వంటి రోగాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తగ్గేలా చేస్తుంది. అలాగే గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సమర్థవంతంగా శోషించుకుంటుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. నిమ్మకాయల్లో విటమిన్ సితోపాటు హెస్పెరిడిన్, డియోస్మిన్, డి-లిమోనీన్ అనే ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాన్సర్లు, నాడీ మండల వ్యవస్థకు చెందిన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
చాలా మంది నీళ్లను తాగేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అయితే వారు తాము రోజూ తాగే నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే నీళ్లు రుచిగా అనిపిస్తాయి. దీంతో తగినన్ని నీళ్లను తాగేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. శరీర భాగాలకు పోషకాలు సరిగ్గా లభిస్తాయి. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అయితే నిమ్మకాయ నీళ్లను తాగలేని వారు లేదా అందుబాటులో లేని వారు లెమన్ టీని తాగినా అదేలాంటి ఫలితం ఉంటుంది. ఇక లెమన్ టీని సేవిస్తే నిమ్మలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణాశయ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
టీ, కాఫీలను రోజూ అధికంగా సేవిస్తుంటే వాటిల్లో ఉండే చక్కెర కారణంగా బరువు పెరుగుతారు. కానీ వాటికి బదులుగా లెమన్ టీని సేవించవచ్చు. ఇది మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నిమ్మరసంలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కనుక లెమన్ టీని సేవిస్తుంటే మూత్రం సాఫీగా జారీ అయ్యేలా చేస్తుంది. దీని వల్ల వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతాయి. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఇలా లెమన్ టీని రోజూ తాగితే అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు.