Rose Flowers Tea | రోజూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్లీ నిద్రించే వరకు చాలా మంది టీ, కాఫీలను అదే పనిగా తాగుతుంటారు. వాస్తవానికి వీటిని తాగడం ఆరోగ్యకరమే అయినప్పటికీ మోతాదుకు మించితే మన శరీరానికి కెఫీన్ నష్టం చేస్తుంది. మన శరీరంలో కెఫీన్ మోతాదు అధికంగా ఉంటే తీవ్ర దుష్సరిణామాలను కలగజేస్తుంది. అయితే మరి టీ, కాఫీలను తాగకుండా ఉండడం ఎలా..? అని ప్రశ్నించేవారు వాటికి బదులుగా హెర్బల్ టీ లను సేవించవచ్చు. హెర్బల్ టీలలోనూ అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో గులాబీ పువ్వుల టీ కూడా ఒకటి. దీన్ని టీ, కాఫీలకు బదులుగా రోజుకు 2 కప్పులు తాగండి. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. గులాబీ పువ్వులను ఎండబెట్టి వాటితో టీ తయారు చేసుకుని తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ టీని రోజూ సేవించడం వల్ల పలు రోగాలు కూడా నయమవుతాయని అంటున్నారు.
గులాబీ పువ్వులలో పాలిఫినాల్స్, ఆంథో సయనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ సంబంధ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. గులాబీ పువ్వుల టీలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ టీని సేవిస్తుంటే మలబద్దకం తగ్గుతుంది. ఈ టీ డైయురెటిక్‌గా కూడా పనిచేస్తుంది. మూత్రం ధారాళంగా, సాఫీగా వచ్చేలా చేస్తుంది. దీంతో మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. గులాబీ పువ్వుల టీని సేవిస్తుంటే లివర్ క్లీన్ అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
గులాబీ పువ్వుల టీని సేవించడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి బయట పడవచ్చు. గులాబీ పువ్వుల రెక్కల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. విటమిన్ సి వల్ల శరీరం రోగాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. గులాబీ పువ్వులలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ టీ ని సేవిస్తుంటే శరీరంలో ఉన్న వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతులో గరగర, గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణ నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
స్త్రీలకు రుతు సమయంలో సహజంగానే నొప్పులు వస్తుంటాయి. కొందరికి నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అలాంటి వారు గులాబీ పువ్వుల టీని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. ఈ టీలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ స్పాస్మోడిక్ గుణాలు రుతు సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీని వల్ల స్త్రీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే ఈ టీని స్త్రీలు రోజూ సేవిస్తుంటే వారిలో రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుంది. గులాబీ పువ్వులు అద్భుతమైన వాసనను కలిగి ఉంటాయి. కనుక ఈ పువ్వుల నుంచి తయారు చేసే టీని సేవిస్తుంటే ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా గులాబీ పువ్వుల టీని సేవిస్తుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.