Oolong Tea | మనకు తాగేందుకు అనేక రకాల హెర్బల్ టీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలను తాగితే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. కనుకనే చాలా మంది ప్రస్తుతం హెర్బల్ టీలను సేవిస్తున్నారు. అయితే వాటిల్లో ఊలాంగ్ టీ కూడా ఒకటి. ఇది సంప్రదాయ చైనీస్ హెర్బల్ టీ. గ్రీన్ టీ కన్నా అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఈ టీని రోజూ సేవిస్తుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఊలాంగ్ టీ కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. రోజూ మీరు తాగే టీ, కాఫీలకు బదులుగా ఈ టీని ఒక కప్పు మోతాదులో తాగండి చాలు, అనేక లాభాలను పొందవచ్చు. ఊలాంగ్ టీలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనల్ని అనేక రోగాల నుంచి బయట పడేస్తాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడేలా చేస్తాయి. ఊలాంగ్ టీని రోజూ తాగాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు.
ఊలాంగ్ టీని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ టీని రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. ఊలాంగ్ టీలో పాలిఫినాల్స్, ఈజీసీజీ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తాయి. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ టీని సేవిస్తుంటే ఉపయోగం ఉంటుంది. ఊలాంగ్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాటెకిన్స్, థియాఫ్లేవిన్స్ ఈ టీలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు తగ్గిపోతాయి.
ఊలాంగ్ టీని సేవించడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఈ టీలో ఎల్-థియానైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఊలాంగ్ టీని తాగడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఈ టీలో అధికంగా ఉండే పాలిఫినాల్స్ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగకుండా చూస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఊలాంగ్ టీని తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. ఈ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి. ఊలాంగ్ టీలో పాలిఫినాల్స్, ఫ్లోరైడ్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతక్షయం నివారించబడుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఊలాంగ్ టీని రోజుకు కప్పు తాగితే చాలు, ఎక్కువ మొత్తంలో తాగాల్సిన పనిలేదు. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.