Coriander Leaves Juice | కొత్తిమీరను మనం రోజూ చేసే వంటల్లో వేస్తుంటాం. కూరల్లో ఎక్కువగా కొత్తిమీరను చివర్లో అలంకరణ కోసం వేస్తారు. కానీ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో కొత్తిమీరను మించింది లేదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కొత్తిమీర మనకు అనేక లాభాలను అందిస్తుంది. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు కొత్తిమీరలో ఉంటాయి. కొత్తిమీరను రోజూ ఉదయం పరగడుపునే జ్యూస్‌లా తయారు చేసి తాగాలని, దీంతో ఎంతో మేలు కలుగుతుందని చెబుతున్నారు. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు సి, ఎ, ఇలతోపాటు పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. కొత్తిమీరలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి పలు రకాల బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. దీంతో ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. కొత్తిమీర జ్యూస్‌ను తాగితే సీజనల్ వ్యాధులను తగ్గించుకోవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే సేవిస్తుంటే శరరీంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కొత్తిమీరలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ అవుతుంది. హైబీపీ ఉన్నవారికి కొత్తిమీర జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది.
కొత్తిమీర జ్యూస్‌ను సేవించడం వల్ల జీర్ణాశయంలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తాయి. అజీర్తిని తగ్గిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గిపోతాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం నుంచి కూడా బయట పడవచ్చు. షుగర్ ఉన్నవారికి కూడా ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తాగితే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవడంతోపాటు శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ సమస్య ఉన్నవారు రోజూ కొత్తిమీర జ్యూస్‌ను తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
కొత్తిమీరలో విటమిన్లు ఎ, సి, ఇ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. కొత్తిమీర జ్యూస్‌ను సేవించడం వల్ల చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కణాలు డ్యామేజ్ అవకుండా సురక్షితంగా ఉంటాయి. దీని వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. కొత్తిమీర ఆకుల్లో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. చర్మంపై ఉండే వాపులను పోయేలా చేస్తాయి. దీంతో మొటిమలు, దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర ఆకుల్లో ఉండే క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఈ జ్యూస్‌ను సేవించడం మరిచిపోకండి.