Coconut Water | మనలో కొబ్బరి నీళ్లను ఇష్టంగా తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు రుచిగా ఉంటాయి. పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఈ నీటిని తాగడానికి ఇష్టపడతారు. కాలంతో సంబంధం లేకుండా అన్ని వేళలా మనకు ఈ కొబ్బరి నీళ్లు లభిస్తుంటాయి. అయితే చాలా మంది ఈ నీటిని వేసవికాలంలో మాత్రమే తాగుతూ ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కొందరికి ఈ నీరు గుర్తుకు వస్తుంది. కానీ కొబ్బరి నీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొబ్బరి నీళ్లను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని వారు సూచిస్తున్నారు. పరగడుపున కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాల గురించి వారు వివరిస్తున్నారు.
కొబ్బరి నీళ్లల్లో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. చెమట ద్వారా శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి లభిస్తాయి. అంతేకాకుండా ఉదయం పూట కొబ్బరి నీరు ఒక రీఫ్రెష్మెంట్ డ్రింక్ లాగా పని చేస్తాయి. నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఉండే సహజ చక్కెరలు, ఎలక్ట్రోలైట్స్ శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లల్లో మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కొబ్బరి నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
అధిక రక్తపోటుతో బాధపడే వారు కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరినీళ్లల్లో పొటాషియం తగిన మొత్తంలో ఉంటుంది. ఈ నీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొబ్బరి నీళ్లల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. శరీరంలో జీవక్రియ వేగం కూడా పెరుగుతుంది. కనుక బరువు కూడా అదుపులో ఉంటుంది. కొబ్బరి నీరు శరీరంపై ఆల్కలైజ్ ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరంలో ఆమ్లాలను తగ్గించడంలో, శరీరంలో పిహెచ్ స్థాయిలను తగ్గించడంలో కొబ్బరి నీరు మనకు ఎంతో సహాయపడుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కొబ్బరి నీరు మనకు ఉపయోగపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్పెక్షన్ లతో బాధపడే వారు కొబ్బరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి కొబ్బరి నీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. లేదంటే నష్టమే జరుగుతుంది.