Cardamom Milk | యాలకులు మన వంట ఇంట్లో సుగంధ ద్రవ్యాలుగా ఎప్పటి నుంచో ఉన్నాయి. మసాలా వంటకాల్లో యాలకులను ఎక్కువగా వేస్తుంటారు. చికెన్, మటన్ తోపాటు శాకాహార మసాలా వంటకాలు, స్వీట్లలో యాలకులను ఉపయోగిస్తారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే యాలకులను రాత్రి పూట పాలలో మరిగించి ఆ పాలను తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాలకుల పాలను రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. యాలకుల పాలను తాగడం వల్ల ట్రిప్టోఫాన్ లభిస్తుంది. ఇది ఒక అమైనో యాసిడ్. నిద్రను ప్రేరేపిస్తుంది. శరీరంలో సెరొటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి ఉన్నవారు రాత్రి పూట యాలకుల పాలను తాగితే ప్రయోజనం ఉంటుంది.
యాలకుల పాలను తాగడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి డిప్రెషన్ నుంచి బయట పడతారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా మారి యాక్టివ్ గా ఉంటుంది. మరుసటి రోజు ఉత్తేజంగా పనిచేస్తారు. యాలకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ, కడుపు నొప్పి ఉన్నవారు ఈ పాలను తాగితే ఎంతగానో ప్రయోజనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. యాలకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో సహాయం చేస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాలకుల్లో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాలకుల పాలను తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా రక్షించుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా గుండె పోటు రాకుండా ఉంటుంది. యాలకుల్లో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల యాలకుల పాలను సేవిస్తే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
యాలకుల పాలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకుల పాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మెటబాలిజం పెరిగేలా చేస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు పాలలో 2 లేదా 3 యాలకులను వేసి బాగా మరిగిస్తే యాలకుల పాలు రెడీ అవుతాయి. కాస్త తేనె కలిపి తాగితే రుచిగా ఉండడమే కాదు, అనేక ప్రయోజనాలను అందిస్తాయి.