Buttermilk | ఒకప్పుడు చాలా మంది ఇళ్లలో కచ్చితంగా ఆవులు లేదా గేదెలు ఉండేవి. దీంతో అందరి ఇళ్లలోనూ పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యికి లోటు ఉండేది కాదు. ఆయా ఆహారాలను మన పూర్వీకులు, పెద్దలు అధికంగా తినే వారు. అందుకనే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఇప్పుడు చాలా మంది వాటిని తీసుకోవడం లేదు. కనీసం భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగతో కూడా తినడం లేదు. కానీ ఈ ఆహారాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో లాక్టిక్ యాసిడ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. కనుక రోజూ భోజనం చేసిన తరువాత కనీసం ఒక పూట అయినా సరే మజ్జిగను తాగాలని పోషకాహార నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మజ్జిగను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని, దీంతో అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
మజ్జిగను చక్కని ప్రో బయోటిక్ ఆహారంగా చెబుతారు. అందువల్ల దీన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగను తాగడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీని వల్ల పోషకాహార లోపం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ మన శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. అందువల్ల జ్వరం వచ్చిన వారు తగ్గితే ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండెల్లో మంట సైతం తగ్గుతుంది.
మజ్జిగ ప్రో బయోటిక్ ఆహారం కనుక మలబద్దకం ఉన్నవారికి మేలు చేస్తుంది. రోజూ మజ్జిగను సేవిస్తుంటే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. మజ్జిగను తాగితే అందులో 90 శాతం నీరు ఉంటుంది కనుక శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది. దీంతో శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. మజ్జిగలో ఉండే పొటాషియం, సోడియం ఎలక్ట్రోలైట్స్ గా పనిచేస్తాయి. దీంతో శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు, బరువు నియంత్రణలో ఉండాలని కోరుకునే వారు మజ్జిగను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పాలు, పెరుగు కన్నా కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక మజ్జిగను తాగితే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.
మజ్జిగను సేవించడం వల్ల అందులో ఉండే ప్రోటీన్లు పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. మజ్జిగలో రైబోఫ్లేవిన్ అధికంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు సహాయం చేస్తుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మజ్జిగలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగను సేవిస్తుంటే అందులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మజ్జిగను తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.