Black Tea | ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది రోజూ తాగుతున్న పానీయాల్లో బ్లాక్ టీ కూడా ఒకటి. చాలా మంది సాధారణ టీని సేవిస్తుంటారు. కానీ దానికి బదులుగా బ్లాక్ టీని సేవిస్తే ఎక్కువ శాతం ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ టీలో థియా ఫ్లేవిన్స్, థియారుబిజిన్స్ ఉంటాయి. ఇవి అనేక లాభాలను అందిస్తాయి. బ్లాక్ టీని రోజూ తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఈ టీని సేవిస్తుంటే ఇందులో ఉండే థియా ఫ్లేవిన్స్, ఫ్లేవనాయిడ్స్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
బ్లాక్ టీలో కెఫీన్ పరిమిత మోతాదులో ఉంటుంది. ఇది అప్రమత్తతను పెంచుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్‌గా ఉంటారు. బ్లాక్ టీలో ఉండే ఎల్-థియానైన్ మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు సహాయం చేస్తుంది. దీని వల్ల బద్దకం తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. మూడ్ బాగుంటుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. బ్లాక్ టీ ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని రోజూ తాగుతుంటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
బ్లాక్ టీలో ఉండే అఫ్లేవిన్స్, థియారుబిజిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బ్లాక్ టీని సేవించడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకుంటుందని, దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. ఈ టీలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు పిండి పదార్థాల మెటబాలిజంకు సహాయం చేస్తాయి. దీని వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి కనుక ఈ టీని సేవిస్తుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. బ్లాక్ టీలో కాఫీ కన్నా కెఫీన్ తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ బ్లాక్ టీని సైతం మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. సాయంత్రం సమయంలో బ్లాక్ టీని సేవించకూడదు. ఇది రాత్రి పూట మీ నిద్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. బ్లాక్ టీని రోజుకు 2 లేదా 3 కప్పులకు మించి తాగకూడదు. బ్లాక్ టీలో కొందరు చక్కెర లేదా తియ్యని సిరప్‌లను కలిపి తాగుతారు. ఇలా తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలగవు. బ్లాక్ టీని నేరుగా అలాగే తాగితేనే లాభాలను పొందవచ్చు.