Bitter Gourd Tea | కాకరకాయలు అంటే చాలా మందికి ఇష్టం ఉండవు. వీటితో ఏం చేసినా వద్దు అనే వారే ఎక్కువగా ఉంటారు. కాకరకాయలతో వేపుడు, పులుసు, టమాటా కూర చేస్తుంటారు. కొందరు వీటితో పచ్చడి కూడా పెడుతారు. కాకరకాయలతో చిప్స్ కూడా తయారు చేయవచ్చు. అయితే కాకరకాయలను తిన్నా, వాటి జ్యూస్ తాగినా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేద ప్రకారం వీటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వ్యాధులను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కాకరకాయలు చేదుగా ఉంటాయి కనుక నేరుగా తినేందుకు లేదా జ్యూస్ తాగేందుకు చాలా మంది అంతగా ఇష్టం చూపించరు. కానీ వీటితో టీ తయారు చేసి తాగవచ్చు. ఇది గోరు వెచ్చగా ఉంటుంది కనుక అలాంటి స్థితిలో తాగితే పెద్దగా చేదు అనిపించదు. కాకరకాయలతో టీ తయారు చేసి తాగినా కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
కాకరకాయలతో తయారు చేసే టీ ని తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో పాలిపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. కనుకనే కాకర కాయ టీని సేవిస్తుంటే షుగర్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత సైతం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కాకర కాయ టీ ని రోజూ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.
హైబీపీ ఉన్నవారు కాకర కాయ టీ తాగుతుంటే బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. కాకర కాయ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ ఎ, సిలతోపాటు ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. వాపుల నుంచి బయట పడవచ్చు. తీవ్రమైన అనారోగ్యాలు రాకుండా అడ్డుకోవచ్చు. కాకర కాయలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. కనుక వీటితో తయారు చేసే టీని తాగుతుంటే క్యాన్సర్లు రావు. క్యాన్సర్ కణాలు పెరగవు. ముఖ్యంగా జీర్ణాశయం, పెద్ద పేగు, ఊపిరితిత్తులు తదితర క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది.
కాకర కాయ టీని సేవిస్తుంటే జీర్ణాశయంలో ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. విరేచనం సాఫీగా అవుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అలాగే లివర్ క్లీన్ అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు కాకర కాయ టీ ని రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. కాకర కాయ టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఈ టీని సేవిస్తుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఇలా కాకర కాయ టీతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.