డోపమైన్.. మన మెదడులో విడుదలయ్యే ఒక న్యూరోట్రాన్స్మీటర్. దీనిని సాధారణంగా ఫీల్ గుడ్ హార్మోన్ అని పిలుస్తారు. మనం ఏదైనా కొత్త విషయాన్ని చూసినప్పుడు, రుచికరమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు మెదడులో డోపమైన్ విడుదలై మనకు ఆనందాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది. ఒకప్పుడు నచ్చిన మనిషిని చూసినప్పుడు, మనసు మెచ్చిన విషయాలు జరిగినప్పుడు ఇలా జరిగేది. కానీ, ఈ డిజిటల్ యుగంలో.. మన డోపమైన్‌ని ఫోన్ ప్రభావితం చేస్తుండటం గమనార్హం.
ఫోన్ రింగ్ అయినా, వైబ్రేట్ అయినా ‘ఏదో కొత్త విషయం వచ్చింది’ అనే కుతూహలం చెలరేగడం కారణంగా మెదడులో డోపమైన్ విడుదలవుతున్నది. మనం పెట్టిన పోస్ట్‌కు లైక్ లేదా కామెంట్ రాగానే, అది ఒక రివార్డులా అనిపించి తక్షణ ఆనందం పొందుతున్నారు. రీల్స్ లేదా షార్ట్స్ స్రోల్ చేస్తున్నప్పుడు, ప్రతి సెకనుకు ఒక కొత్త విషయం కనిపిస్తూ మెదడుకు నిరంతరం డోపమైన్ హిట్స్ అందిస్తుంది.
క్రమంగా, మెదడు ఈ స్థాయి ఆనందానికి అలవాటు పడిపోతుంది. దీనివల్ల సాధారణ విషయాల్లో (చదువు, పని, సంభాషణలు) ఆనందం కలగదు. నిరంతర డోపమైన్ హిట్స్ వల్ల కొన్ని మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వాటిలో.. మెదడు ఎప్పుడూ కొత్త ప్రేరణ కోసం వెతుకుతూ ఉండటం వల్ల ఒక విషయంపై దృష్టి పెట్టలేం. డోపమైన్, ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును అప్రమత్తంగా ఉంచి నిద్రను దూరం చేస్తాయి. దాంతో మెదడు నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వల్ల త్వరగా అలసిపోతుంది. ఇది ఒక మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. మనం ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మెదడు నిలకడగా తకువ స్థాయిలో డోపమైన్‌ను విడుదల చేస్తుంది.
స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు మాత్రం ప్రతి సెకనుకు ఒక కొత్త నోటిఫికేషన్ లేదా వీడియో ద్వారా ఇన్స్టంట్ డోపమైన్ హిట్స్ లభిస్తాయి. ఇలా వేగవంతమైన ఆనందానికి అలవాటు పడిన మన మెదడు కాలక్రమంలో ఏకాగ్రతను కోల్పోతుంది. ఫోన్ పకన ఉన్నప్పుడూ తరచూ ‘ఏదైనా మెసేజ్ వచ్చిందేమో’ అని దాని వంకే చూస్తుంటాం. దీన్నే ప్రోయాక్టివ్ చెకింగ్ అంటారు. ప్రతిసారీ మనం పనిని ఆపి ఫోన్ చూడటం వల్ల మన ఏకాగ్రత ముకలైపోతుంది.
ఒకసారి ఏకాగ్రత చెదిరితే, తిరిగి పూర్తిస్థాయిలో పనిపై దృష్టి పెట్టడానికి సగటున 23 నిమిషాలు పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్వం ఖాళీగా ఉన్నప్పుడు ఇతర విషయాలు ఆలోచించేవాళ్లం లేదా ప్రకృతిని గమనించేవాళ్లం. కానీ, ఇప్పుడు ఒక నిమిషం బోర్ కొట్టినా వెంటనే ఫోన్ అందుకుంటున్నాం. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లేకుండా పోతున్నది. ఏకాగ్రత పెరగడానికి మెదడుకు కొంత ఖాళీ సమయం అవసరం, కానీ డోపమైన్ హిట్స్ ఆ అవకాశాన్ని ఇవ్వడంలేదు.
మోనో-టాసింగ్: ఒకే సమయంలో ఒకే పని చేయడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ చూస్తూ చదవడం లేదా తింటూ పని చేయడం మానుకోవాలి.
డోపమైన్ డిటాక్స్: రోజులో కనీసం 1-2 గంటలు ఎటువంటి డిజిటల్ పరికరాలు లేకుండా గడపాలి. ఇది మెదడులోని డోపమైన్ గ్రాహకాలను తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది.
డీప్ వర్: ఫోన్‌ను పక గదిలో ఉంచి, కనీసం 45 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో పని చేయడం ప్రాక్టీస్ చేయాలి.
స్టాప్ నోటిఫికేషన్లు: అనవసరమైన యాప్స్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు.
గ్రే సేల్ మోడ్: ఫోన్ స్రీన్‌ను బ్లాక్ అండ్ వైట్లోకి మార్చడం వల్ల మెదడుకు కలిగే ఆకర్షణ తగ్గుతుంది.
డెడ్ జోన్స్: భోజనం చేసేటప్పుడు, పడుకునే ముందు ఫోన్‌ను దూరంగా ఉంచడం అలవాటు చేసుకోవాలి.
ప్రత్యామ్నాయాలు: డోపమైన్ కోసం ఫోన్ కాకుండా వ్యాయామం, పుస్తక పఠనం లేదా తోటపని వంటి సహజమైన పనులను
ఎంచుకోవాలి.