ఎండలు మొదలవగానే అందరూ చల్లటి పదార్థాలపై మనసు పడతారు. ఎండన పడి వచ్చాక చల్లచల్లటి పానీయాలు తాగుతుంటారు. వీటిలో ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ నీళ్లు కూడా ఉంటాయి. అయితే, ఫ్రిజ్ నీళ్లు, ఐస్ కలిపిన నీళ్లు శరీరానికి వెంటనే చల్లదనాన్ని ఇచ్చినప్పటికీ, వీటివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
జీర్ణక్రియకు ముప్పు: ఐస్ నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. చల్లటి నీళ్లు అరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి, తింటున్నప్పుడు ఐస్ నీళ్లు తాగితే.. మన శరీరం అన్నం అరిగించడానికి బదులుగా నీళ్ల ఉష్ణోగ్రతను మామూలు స్థితికి తీసుకురావడానికి శక్తిని వాడుకుంటుంది. అందువల్ల ఆహారం తింటున్నప్పుడు చల్లటి నీళ్లు తాగనే తాగకూడదు.
గొంతు సమస్యలు: ఐస్ నీళ్లు తాగడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది గొంతునొప్పి, కఫం, జలుబు, గొంతువాపు తదితర సమస్యలకు దారితీస్తుంది. శ్వాస సమస్యలు ఉన్నవాళ్లకు ఐస్ నీళ్లు మంచివి కాదు.
తలనొప్పి: ఎండన పడి వచ్చిన తర్వాత ఐస్ నీళ్లు తాగితే తలనొప్పి బాధించే అవకాశం ఉంది. చల్లటి నీళ్లు వెన్నులో నాడులను చల్లబరుస్తాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. ఇక సైనస్ సమస్య ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఐస్ నీళ్లు తాగకూడదు. కాదని తాగితే సమస్య మరింత ఎక్కువవుతుంది.
హీమరాయిడ్స్: ఐస్ నీళ్లు దీర్ఘకాలం పాటు తాగుతూ ఉంటే శరీరంలో పైల్స్ (మొలలు) ఏర్పడతాయి. అతి శీతల పరిస్థితుల్లో వస్తువులు గడ్డకడతాయి. ఐస్ నీళ్లు తాగడం వల్ల మలం గట్టిపడుతుంది. ఇది పైల్స్‌కు కారణమవుతుంది. అతిగా చల్లటి నీళ్లు తాగితే పేగుల్లో పుండ్లకు దారితీయొచ్చు. దీంతో మలంలో రక్తం పడటం, కడుపునొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి.
డీహైడ్రేషన్: ఐస్ నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తుతుందనే విషయం చాలామందికి అంతగా తెలియదు. నిజానికి, బాగా చల్లగా ఉన్న నీళ్లు మన దాహం తీరుస్తాయి. అయితే, ఇవి కొద్దిగా తాగగానే మరిన్ని నీళ్లు తాగాలని అనిపించదు. దీంతో నీళ్లు తాగాల్సిన దానికంటే తక్కువగా తీసుకుంటాం. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.
ఐస్ నీళ్లు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కాబట్టి, వీటిని తీసుకోకపోవడమే మంచిది. నీళ్లను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత దగ్గరే తాగాలి. ఎండకాలంలో చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలోని నీటిని ఎంచుకోవాలి. అంతేతప్ప ఐస్ కలుపుకొని, లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకొని బాగా చల్లగా అయ్యాక తాగకూడదు.