Potatoes | ఆలుగడ్డల గురించి ఆరోగ్య చర్చలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. కొందరు వీటిని పొటాషియం, పీచు, విటమిన్లకు మంచి వనరుగా ప్రశంసిస్తే, మరికొందరు అధిక పిండి పదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు. అయితే తాజాగా వెలువడిన ఒక దీర్ఘకాలిక అధ్యయనం ఆలుగడ్డల కంటే వాటిని వండే విధానమే ఆరోగ్య ప్రమాదాలకు ప్రధాన కారణమని వెల్లడించింది. దాదాపు 37 సంవత్సరాల పాటు 2 లక్షలకు పైగా మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఫ్రెంచ్ ఫ్రైస్ను తరచూ తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఉడికించిన, కాల్చిన లేదా మెత్తగా చేసిన ఆలుగడ్డలు మాత్రం మధుమేహ ప్రమాదాన్ని పెంచలేదని అధ్యయనం తేల్చింది. 1984 నుంచి 2021 వరకు అమెరికాలో నిర్వహించిన మూడు ప్రధాన పరిశోధనల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అధ్యయనం ప్రారంభ సమయంలో పాల్గొన్న వారిలో మధుమేహం, గుండెజబ్బులు లేదా క్యాన్సర్ లేవు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆహారపు అలవాట్లపై సమగ్ర సమాచారం సేకరించారు.
పరిశోధన కాలంలో మొత్తం 22,299 మందికి టైప్-2 మధుమేహం నిర్ధారణ అయింది. వారానికి మూడు సార్లు ఆలుగడ్డలు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం స్వల్పంగా 5 శాతం పెరిగినట్లు కనిపించింది. అయితే వంట విధానాన్ని బట్టి పరిశీలించగా మరింత స్పష్టమైన తేడాలు బయటపడ్డాయి. వారానికి మూడు సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరోవైపు అదే పరిమాణంలో ఉడికించిన, కాల్చిన లేదా మెత్తగా చేసిన ఆలుగడ్డలను తీసుకున్న వారిలో మధుమేహ ప్రమాదం పెరిగినట్లు ఎలాంటి గణాంక ఆధారాలు లభించలేదు. ఈ తేడాకు ప్రధాన కారణం డీప్ ఫ్రై చేసే ప్రక్రియ అని పరిశోధకులు చెబుతున్నారు. నూనెలో బాగా వేయించడం వల్ల ఆహారంలో కేలరీలు, అనారోగ్యకర కొవ్వులు పెరుగుతాయి. అలాగే ఆహార రసాయన నిర్మాణంలో మార్పులు చోటుచేసుకుని ఇన్సులిన్ నిరోధకతను పెంచే అవకాశం ఉంటుంది. పరిశోధకులు మరో ఆసక్తికర అంశాన్ని కూడా పరిశీలించారు.ఆలుగడ్డలకు బదులుగా ఇతర కార్బోహైడ్రేట్ ఆహారాలను తీసుకుంటే మధుమేహ ప్రమాదంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేశారు.
వారానికి మూడు సార్లు ఆలుగడ్డల స్థానంలో సంపూర్ణ ధాన్యాలను తీసుకున్న వారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8 శాతం తగ్గినట్లు గుర్తించారు. అదే ఫ్రెంచ్ ఫ్రైస్కు బదులుగా సంపూర్ణ ధాన్యాలను తీసుకుంటే ఈ ప్రమాదం 19 శాతం వరకు తగ్గింది. అయితే ఉడికించిన లేదా కాల్చిన బంగాళాదుంపలకు బదులుగా తెల్ల బియ్యాన్ని ఎక్కువగా తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని పెంచినట్లు పరిశోధన పేర్కొంది. దీంతో ఆహారంలో ఏ పదార్థాన్ని తొలగిస్తున్నామన్నదే కాకుండా, దాని స్థానంలో ఏది తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమని స్పష్టమవుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, డీప్ ఫ్రై చేసిన ఆలుగడ్డల పదార్థాలను క్రమంగా తగ్గించడం మంచిది. ఇంట్లో ఆలుగడ్డలను వండేటప్పుడు తొక్కతోనే ఉడికించడం లేదా కాల్చడం ద్వారా పీచు పదార్థాన్ని ఎక్కువగా పొందవచ్చు. అలాగే ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు వంటి సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను మెరుగ్గా నియంత్రించుకోవచ్చు. సమతుల్య ఆహారం, సరైన వంట పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.