High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
రక్తపోటు అంటే చాలామంది రెండు సంఖ్యలుగా మాత్రమే చూస్తారు. కానీ గుండె అలా చూడదు. రక్తపోటు ఎక్కువగా ఉండే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపించేందుకు గుండె మరింత శ్రమించాల్సి వస్తుంది. కాలక్రమేణా ఈ అదనపు ఒత్తిడి రక్తనాళాలను దెబ్బతీసి, గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ముప్పును పెంచుతుంది.
High Blood Pressure | రక్తపోటు అంటే చాలామంది రెండు సంఖ్యలుగా మాత్రమే చూస్తారు. కానీ గుండె అలా చూడదు. రక్తపోటు ఎక్కువగా ఉండే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపించేందుకు గుండె మరింత శ్రమించాల్సి వస్తుంది. కాలక్రమేణా ఈ అదనపు ఒత్తిడి రక్తనాళాలను దెబ్బతీసి, గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధుల ముప్పును పెంచుతుంది. చికిత్స తీసుకుంటున్నప్పటికీ రక్తపోటు అదుపులోకి రాకపోతే ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. కనీసం మూడు రకాల మందులు తీసుకుంటున్నప్పటికీ రక్తపోటు 140/90 ఎంఎంహెచ్‌జీ లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగితే దాన్ని రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్‌గా పరిగణిస్తారు. ఇలాంటి రోగులకు రక్తపోటు అదుపులో ఉన్నవారితో పోలిస్తే గుండెపోటు, పక్షవాతం, చివరి దశ మూత్రపిండాల వ్యాధి, మరణం వంటి సమస్యల ముప్పు రెండు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
భారత్‌లో పెరుగుతున్న సమస్య..
భారత్‌లో ఈ సమస్య చాలామంది ఊహించిన దానికంటే పెద్దదే. తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్-6 గణాంకాల ప్రకారం, 15 ఏళ్లు పైబడిన భారతీయ మహిళల్లో 19.4 శాతం, పురుషుల్లో 22.1 శాతం మందికి రక్తపోటు ఎక్కువగా ఉంది లేదా దాన్ని నియంత్రించేందుకు మందులు వాడుతున్నారు. 17 లక్షల మందికి పైగా భారతీయులపై నిర్వహించిన ఒక విశ్లేషణలో, హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో కేవలం 8.5 శాతం మందికే రక్తపోటు నియంత్రణలో ఉన్నట్లు తేలింది. సమర్థవంతమైన రక్తపోటు నియంత్రణ ఎంత పెద్ద సవాలో ఇది స్పష్టం చేస్తోంది. అయితే మందులు క్రమం తప్పకుండా తీసుకుంటూ, ఆహారంపై శ్రద్ధ పెట్టి, శారీరకంగా చురుకుగా ఉన్నప్పటికీ రక్తపోటు తగ్గకపోతే ఏం చేయాలి? అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఇందుకు నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. అధిక రక్తపోటును నియంత్రించడం ప్రతిసారీ మరో ట్యాబ్లెట్ వేసుకోవడం లేదా జీవనశైలిలో మరింత కఠినమైన మార్పులు చేయడం మాత్రమే కాదు. సరైన చికిత్స తీసుకుంటున్నప్పటికీ రక్తపోటు ఎక్కువగానే ఉంటే, అది ఎందుకు అదుపులోకి రావడం లేదనే విషయాన్ని వైద్యులు పరిశీలించాల్సి ఉంటుంది.
జీవనశైలి మార్పులు అవసరం..
జీవనశైలిలో మార్పులకు ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, పొగాకు వినియోగాన్ని నివారించడం, తగినంత నిద్ర పొందడం వంటి చర్యలు రక్తపోటును మెరుగ్గా నియంత్రించేందుకు సహాయపడతాయి. అయితే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరిలో రక్తపోటు ఒకే విధంగా స్పందిస్తుందని చెప్పలేం. నిజమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉంటే వైద్యపరమైన సమీక్ష చేయించుకోవాలి. చికిత్సకు లొంగని అధిక రక్తపోటుకు అనేక కారణాలు ఉంటాయి. వైద్యులు ముందుగా రోగి సూచించిన విధంగా మందులు తీసుకుంటున్నారా, రక్తపోటును సరిగ్గా కొలుస్తున్నారా అనే విషయాలను పరిశీలిస్తారు. అధిక ఉప్పు వినియోగం, ఊబకాయం, స్లీప్ అప్నియా, మూత్రపిండాల వ్యాధి లేదా ఇతర మందుల వినియోగం రక్తపోటు పెరగడానికి కారణమవుతున్నాయా అనే విషయాన్ని కూడా చూస్తారు. వీటితోపాటు హార్మోన్లకు సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలిస్తారు.
ఆల్డోస్టెరోన్ హార్మోన్..
నిరంతరం రక్తపోటు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లలో ఆల్డోస్టెరోన్ ఒకటి. శరీరంలో ఉప్పు, నీటి సమతుల్యతను నియంత్రించడంలో ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్డోస్టెరోన్ అధికంగా ఉత్పత్తి అయితే శరీరంలో సోడియం, నీరు ఎక్కువగా నిల్వ ఉంటాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. కాలక్రమేణా రక్తనాళాలు, ఇతర అవయవాల్లో కూడా మార్పులు రావడానికి ఇది కారణమవుతుంది. అందుకే సాధారణ చికిత్స సరిపోనప్పుడు రోగి హైపర్‌టెన్షన్‌కు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలాకాలంగా రక్తపోటు నియంత్రణలో లేకపోతే మందు మోతాదును పెంచడం లేదా మరో మందును చేర్చడం సాధారణ చికిత్సా విధానంగా ఉంది. ఇవి ఇప్పటికీ ముఖ్యమైన చర్యలే. అయితే ప్రస్తుతం హైపర్‌టెన్షన్ చికిత్స మరింత వ్యక్తిగతీకృత విధానం వైపు సాగుతోంది. కేవలం రక్తపోటు సంఖ్యను చూడడంతో ఆగకుండా, ఆ రక్తపోటు పెరగడానికి వెనుక ఉన్న జీవశాస్త్రపరమైన కారణం ఏమిటో తెలుసుకోవడంపై వైద్యులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆల్డోస్టెరోన్ ఉత్పత్తి వంటి నిర్దిష్ట జీవసంబంధ మార్గాలను లక్ష్యంగా చేసుకునే ఆధునిక చికిత్సలు ఈ మార్పును ప్రతిబింబిస్తున్నాయి.
వైద్య సమీక్ష తప్పనిసరి..
రోగి రక్తపోటు ఎందుకు నియంత్రణలోకి రావడం లేదో అర్థమైన తర్వాత, తదుపరి చికిత్సా చర్యపై వైద్యులు మరింత సమర్థవంతంగా నిర్ణయం తీసుకుంటారు. లక్ష్యం తదుపరి వైద్య పరీక్షలో రక్తపోటు సంఖ్యను మెరుగుపరచడం మాత్రమే కాదు. నియంత్రణలో లేని రక్తపోటు వల్ల గుండెతోపాటు ఇతర అవయవాలపై దీర్ఘకాలంగా పడే భారాన్ని తగ్గించడం కూడా ప్రధాన లక్ష్యం. రోగులు తమకు ఎలా అనిపిస్తుందనే దానిపైనే గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయకూడదు. అధిక రక్తపోటుకు స్పష్టమైన లక్షణాలు లేకపోయినా, అది నిశ్శబ్దంగా గుండెపై ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. కాబట్టి రక్తపోటు సంఖ్యలను తెలుసుకోవాలి, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి, రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ రక్తపోటు అదుపులోకి రాకపోతే, దానికి కారణమేమిటో వైద్యుడితో చర్చించాలి. దీంతో పరిస్థితి ప్రాణాంతకం అయ్యే వరకు వేచి చూడకుండా జాగ్రత్త పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

