HDL Levels | మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే ప్రమాదం అన్న విషయం అందరికీ తెలిసిందే. దీని వల్ల హార్ట్ ఎటాక్ సంభవిస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కనుకనే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎల్లప్పుడూ తక్కువగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్ అనగానే ఒక్కటే అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మన శరీరానికి చెడు చేస్తుంది. దీన్నే ఎల్డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇంకొక కొలెస్ట్రాల్ మనకు మేలు చేస్తుంది. దీన్నే హెచ్‌డీఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ అంటారు. అయితే శరీరంలో ఎల్డీఎల్ స్థాయిలు తక్కువగా, హెచ్‌డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మందిలో ఎల్డీఎల్ అధికంగా ఉంటోంది. దీని వల్ల గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను హెచ్‌డీఎల్‌ను పెంచాల్సి ఉంటుంది. ఇక ఇందుకు పలు రకాల ఆహారాలు మనకు దోహదం చేస్తాయి.
శరీరంలో హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచుకునేందుకు అనేక ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రోజూ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. గ్రీన్ బీన్స్‌తోపాటు రాజ్మా, బ్లాక్ బీన్స్, సోయా బీన్స్ ను తరచూ తింటుండాలి. ఇవి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శనగలు, పెసలు వంటి పప్పు దినుసులను సైతం తరచూ తింటున్నా కూడా హెచ్‌డీఎల్ పెరుగుతుంది. వీటిల్లో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్ స్థాయిలను పెరిగేలా చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. కనుక వీటిని తరచూ తినాలి. అలాగే వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పును తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియం, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్‌లో మెగ్నిషియం, విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను సురక్షితంగా ఉంచుతాయి. శరీరంలో హెచ్‌డీఎల్ లెవల్స్ పెరిగేలా చేస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే అవకాడోలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా ఉపయోగం ఉంటుంది. ఈ పండ్లను తింటే రక్త నాళాల వాపులు తగ్గుతాయి. అలాగే హెచ్‌డీఎల్ లెవల్స్ పెరిగి ఎల్డీఎల్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో ఉండే మెగ్నిషియం కండరాల వాపులను తగ్గిస్తుంది. ఈ పండ్లలోని పొటాషియం రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక అవకాడోలను తరచూ తింటుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇక శరీరంలో హెచ్‌డీఎల్ లెవల్స్ పెరగాలంటే అందుకు మనం సరైన జీవనశైలిని కూడా పాటించాల్సి ఉంటుంది. రాత్రి పూట త్వరగా భోజనం చేయాలి. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్‌ను తినకూడదు. మరీ అతిగా తినకూడదు. రాత్రిపూట త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. వేళకు భోజనం చేయాలి. అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను తినాలి. చక్కెర, ఉప్పు వాడకం తగ్గించాలి. మద్యం సేవించడం తగ్గించాలి లేదా మానేయాలి. పొగ తాగడం మానేయాలి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా హెచ్‌డీఎల్ స్థాయిలు పెరిగేందుకు దోహదం చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను తింటూ సరైన జీవనశైలిని పాటిస్తుంటే హెచ్‌డీఎల్ లెవల్స్‌ను పెంచుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు.