Dragon Fruit | చూసేందుకు పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా మనకు డ్రాగన్ ఫ్రూట్ పండ్లు కనిపిస్తాయి. వీటినే పిటాయా అని కూడా పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్స్ మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటున్నాయి. కేవలం చైనాకు మాత్రమే పరిమితం అయిన ఈ పండును ప్రస్తుతం మన దేశంలోనూ సాగు చేస్తున్నారు. అందువల్ల మనకు డ్రాగన్ ఫ్రూట్స్ విరివిగా లభిస్తున్నాయి. ఇక సీజన్ కావడంతో ప్రస్తుతం మనకు రహదారుల పక్కన డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి పైకి పింక్ రంగులో, లోపల తెలుపు రంగులో ఉంటాయి. తింటే రుచి కాస్త చప్పగా, వగరుగా ఉంటుంది. అయితే డ్రాగన్ ఫ్రూట్ పండ్లను నిజంగా మనకు లభించిన వరం అనే చెప్పవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే మనకు అనేక పోషకాలు లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్లో మన శరీరానికి కావల్సిన అనేకే విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిల్లో అధికంగానే ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల బీటా సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ఈ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో వాపులు తగ్గుతాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి. అందువల్ల డ్రాగన్ ఫ్రూట్స్‌ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను రోజూ తినడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీంతో ఇతర అవయవాల ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల శరీరం కొల్లాజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది. దీంతో చర్మంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం బారి నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఈ పండ్లలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.