Tea Tree Oil | చర్మ సంరక్షణకు ఉపయోగించే వివిధ రకాల నూనెల్లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. మెలలూకా ఆల్టర్నిఫోలియా అనే మొక్క ఆకుల నుండి తీసిన నూనెను టీ ట్రీ ఆయిల్ అంటారు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యంగా చర్మ సమస్యలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ఆయిల్ ఎంతో సహాయపడుతుంది. కీటక వికర్షణిగా కూడా ఈ నూనె పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. టీ ట్రీఆయిల్ లో యాంటీ మైక్రోబయల్ ప్రభావాన్ని కలిగి ఉండే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు వైరస్ కణత్వచాలను దెబ్బతీసి వాటి మరణానికి కారణమవుతాయి. కనుక ఈ ఆయిల్ ను వాడడం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మజీవులు నశించి చర్మ ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్ లో శోథ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లామేషన్ తగ్గుతుంది. తద్వారా మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి సమస్యల లక్షణాలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆయిల్ లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో ఈ నూనెను వాడడం వల్ల మంట తగ్గడంతో పాటు ఇన్పెక్షన్ లు కూడా రాకుండా ఉంటాయి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. అంతేకాకుండా గాయాల వల్ల కలిగే మచ్చల ప్రభావం కూడా తగ్గుతుంది. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేయడంలో సహాయపడతాయి. దీంతో మొటిమలతో పాటు చర్మం ఎర్రగా మారడం కూడా తగ్గుతుంది. ఈ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడడం వల్ల స్పష్టమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
టీ ట్రీ ఆయిల్ ను వాడడం వల్ల ఫంగల్ ఇన్పెక్షన్ లు తగ్గుతాయి. శిలీంధ్రాల కణత్వచాలను దెబ్బతీసి ఇన్పెక్షన్ ను తగ్గించడంలో ఈ ఆయిల్ మనకు ఎంతో సహాయపడుతుంది. క్రీడాకారులు ఎక్కువగా కాళ్లు, గోర్ల ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. ఈ నూనెను వాడడం వల్ల ఇన్పెక్షన్ లు తగ్గి గోళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు టీ ట్రీ ఆయిల్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు చుండ్రు సమస్య తగ్గించడంతో పాటు తలచర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి నోటి దుర్వాసను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ మనకు సహాయపడుతుంది. ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాల ఆరోగ్యంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
టీ ట్రీ ఆయిల్ దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను నశింపజేసి దుర్వాసన రాకుండా చేస్తుంది. ఈ ఆయిల్ ను వాడడం వల్ల శరీర దుర్వాసన తగ్గి చర్మం నుండి తాజా వాసన వస్తుంది. కీటకాలను తరిమికొట్టే సమ్మేళనాలు కూడా టీ ట్రీ ఆయిల్ లో ఉంటాయి. ఈ నూనెను వాడడం వల్ల కీటకాలు కుట్టడం, కీటక కాటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి. అంతేకాకుండా కీటకాలు కుట్టినప్పుడు ఈ నూనెను వాడడం వల్ల చికాకు, మంట, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. టీ ట్రీ ఆయిల్ ఇలా అనేక రకాలుగా మన చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని నేరుగా ఉపయోగించడానికి బదులుగా కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో కలిపి వాడాలి. అలాగే దీనిని ఉపయోగించే ముందు కొద్దిగా చర్మంపై రాసుకోవాలి. అలర్జీ వంటి ఎటువంటి ప్రతిచర్యలు రానప్పుడే దీనిని పూర్తిగా ఉపయోగించడం మంచిది.