Nela Usiri | ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది నేరుగా అలాగే తింటుంటారు. ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు. పులిహోర వంటివి చేస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మీకు తెలుసా..? నేల ఉసిరి అనే మరో మొక్క కూడా ఉంది. దీని ఆకులు, కాయలు అచ్చం ఉసిరిలాగే ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఈ మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నేల ఉసిరి మన చుట్టూ ప్రకృతిలోనే కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేల ఉసిరి మొక్కలను మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ మొక్క ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. వీటితో పలు ఔషధాలను తయారు చేస్తారు. అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ ఆకులకు ఉంటుంది. ఈ ఆకులను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
చాలా మందికి తరచూ నోరు, నాలుక, పెదవులు పగులుతుంటాయి. సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని ఈ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో చిన్నగా కారం తగిలినా చాలు నోరంతా మంటగా కూడా ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు నేల ఉసిరి ఆకులు ఎంతగానో పనిచేస్తాయి. ఈ ఆకులను కొన్ని తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను వడకట్టి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రెండు మూడు రోజుల పాటు చేస్తే నోట్లో ఉండే పుండ్లు తగ్గుతాయి. నాలుక పగలడం తగ్గుతుంది. నేల ఉసిరి ఆకులతో కషాయం కాచి తాగుతుంటే దగ్గు, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతర శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం పోతుంది.
నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని లేదా రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటుంటే కామెర్ల నుంచి బయట పడవచ్చు. కామెర్లను తగ్గించి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల వల్ల లివర్ లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందవచ్చు. నేల ఉసిరి ఆకులను నేరుగా కూడా తినవచ్చు. అలా తింటే అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది. నోటికి రుచి తెలుస్తుంది. నేల ఉసిరి ఆకుల రసంలో కాస్త చక్కెర కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను, వేర్లను దంచి తింటుంటే మూత్రం సాఫీగా వస్తుంది. రుతుస్రావం మరీ అధికంగా అయ్యే మహిళలు నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతుండాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.
నేల ఉసిరి మొక్కలోని అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జ్వరం ఉన్నవారు ఈ ఆకులతో కషాయం కాచి తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. అన్ని రకాల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లకు కూడా ఈ ఆకులు పనిచేస్తాయి. నేల ఉసిరి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తుంటే కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. నేల ఉసిరి ఆకులు మన శరీరానికి చలువ చేస్తాయి. వేసవిలో ఈ ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగాలి. ఇలా చేస్తుంటే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండలో తిరిగినా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇలా నేల ఉసిరి మొక్క మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి.