Manuka Honey | తేనె వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో తేనెను ప్రముఖంగా ఉపయోగిస్తారు. తేనెను పలు ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగాలు రాకుండా రక్షిస్తాయి. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి. తేనెను తీసుకుంటే గొంతు సమస్యు నయమవుతాయి. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. దగ్గు, జలుబు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ సైతం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మీకు తెలుసా.. తేనెలోనూ పలు రకాలు ఉంటాయి. వాటిల్లో మనుకా తేనె కూడా ఒకటి. ఇది కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మనుకా అనే పువ్వుల నుంచి తేనెటీగలు ఈ తేనెను సేకరిస్తాయి. అందుకనే దీనికి మనుకా తేనె అనే పేరు వచ్చింది.
సాధారణ తేనెతో పోలిస్తే మనుకా తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. మనుకా తేనె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఎక్కువగా తయారవుతుంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు సరఫరా చేస్తారు. ఈ తేనె ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇది అందించే ఔషధ గుణాలు, పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం సాధారణ తేనె కన్నా అధికంగా ఉంటాయి. మనుకా తేనెను కేవలం 1 టీస్పూన్ తీసుకుంటే చాలు ఏకంగా 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. 8.4 గ్రాముల పిండి పదార్థాలు, 8.2 గ్రాముల సహజ సిద్ధమైన చక్కెర లభిస్తాయి. ఈ తేనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మనుకా తేనెను నేరుగా గాయాలు, పుండ్లపై రాయవచ్చు. దీంతో అవి త్వరగా మానుతాయి.
మనుకా తేనెను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలపాలి. అందులోనే అర టీస్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకుంటుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. గొంతులో గరగర, గొంతు నొప్పి, గొంతులో మంట వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా ఆడుతుంది. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనుకా తేనె సహజసిద్ధమైన ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. అందువల్ల ఈ తేనెను రోజూ తీసుకుంటే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి సమస్యను తగ్గిస్తుంది. తీవ్రమైన అజీర్తి ఉన్నవారు కూడా ఈ తేనెను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
మనుకా తేనెలో యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో ఉండే అల్సర్లను తగ్గిస్తాయి. పొట్ట, పేగుల్లో ఉండే పుండ్లు మానిపోతాయి. జీర్ణాశయంలో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా విరేచనాలు అవుతున్నవారు ఈ తేనెను తింటే ఎంతో ఫలితం ఉంటుంది. మనుకా తేనెలో ఉండే యాంటీ వైరల్ గుణాలు వైరస్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా వైరస్ల కారణంగా ఏర్పడే జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. ఇందుకు గాను ఈ తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ మోతాదులో కలిపి తాగుతుండాలి. జ్వరం త్వరగా తగ్గుతుంది. ఇలా మనుకా తేనె ఎంతో మేలు చేస్తుంది. అయితే సాధారణ తేనెతో పోలిస్తే ఈ తేనె అలర్జీలను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అలర్జీలు ఉన్నవారు ఈ తేనెను తీసుకోకపోవడమే మంచిది.