ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే వేడి వేడి వంటకాలు ఇంటికి వచ్చేస్తున్నాయ్. కమ్మని రుచి, బంపర్ ఆఫర్, భారీ డిస్కౌంట్ గురించే మాట్లాడుకుంటాం. కానీ, డెలివరీ చేసిన ఫుడ్ ఎలా ఉంది? ఎలా తయారైందో పట్టించుకోం. హైదరాబాద్‌తోపాటు పెద్ద పట్టణాల్లోకీ ఆన్లైన్ డెలివరీ విస్తరించింది. సాధారణంగానే రెస్టారెంట్స్‌కి వెళ్తే బిర్యానీ, నాన్‌వెజ్ ఆర్డర్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఇక ఆన్లైన్ సర్వీసులు వచ్చాక నాన్‌వెజ్ ఐటమ్స్‌కి గిరాకీ పెరిగిందని ఫుడ్ డెలివరీ యాప్‌ల డాటా చెబుతూనే ఉంది. ఇలా ఎడాపెడా నాన్‌వెజ్ తింటున్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో చికెన్ వండేందుకు ఫ్రోజెన్ చికెన్ ఉపయోగిస్తున్నారు తయారీదారులు. అత్యల్ప (సున్నా డిగ్రీల నుంచి మైనస్ పద్దెనిమి డిగ్రీల సెల్సియస్ మధ్య) ఉష్ణోగ్రతలో ఈ చికెన్‌ని నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆహారం పాడుకాదని చాలామంది భావిస్తారు. కాబట్టి ఫ్రోజెన్ చికెన్‌లో ఏ విధమైన బ్యాక్టీరియా ఉండదని నమ్ముతున్నారు.
కానీ, ఆ ఉష్ణోగ్రత దగ్గర కూడా సాల్మొనెల్లా బ్యాక్టీరియా మనగలదు. ఇది తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఫ్రోజెన్ చికెన్ రుచిగా, తాజాగా అనిపించేందుకు సోడియం నైట్రేట్, సోడియం నైట్రైట్ లాంటి రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రెండు రసాయనాలు జీర్ణకోశ క్యాన్సర్లను కలుగజేస్తాయి. నరాలు, కిడ్నీలను బలహీనపరుస్తాయి. ఆహారం జీర్ణమైన తర్వాత ఈ రెండు కెమికల్స్ శరీరంలోకి ప్రవేశిస్తే.. జీన్ టాక్సిక్లుగా పనిచేస్తాయి. కణాల్లోని జన్యు పదార్థాన్ని నష్టపరుస్తాయి. ఫ్రోజెన్ చికెన్‌ని గర్భధారణకు సిద్ధమవుతున్న వాళ్లు, గర్భిణులు ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీన్ని తినడం వల్ల పుట్టబోయే పిల్లల్లో జన్యు లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని
హెచ్చరిస్తున్నారు.