హలో డాక్టర్. నా వయసు ఇరవై ఆరు. బొద్దుగా ఉంటాను. థైరాయిడ్, పీసీఓఎస్ సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఆరోనెల గర్భిణిని. మా చుట్టాల్లో ఒకావిడకు థైరాయిడ్ ఉంది. వాళ్ల బాబుకు కూడా పుట్టినప్పటి నుంచే థైరాయిడ్ రుగ్మత వచ్చింది. నా బిడ్డకూ ఇలాగే జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఆ సమస్య తలెత్తకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
– ఓ సోదరి
మీరు ఒక విషయం గమనించాలి. మీ బంధువుల పిల్లాడికి వచ్చింది కాబట్టి, మీ బిడ్డకు కూడా రావాలనే నియమమేం లేదు. వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. మంచి సమతులాహారం తీసుకోండి. థైరాయిడ్ పనితీరును క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోండి. నిపుణుల సలహాతో, డోసేజీ ప్రకారం మాత్రలు వేసుకోండి. థైరాయిడ్ అదుపులో లేకపోతే, కడుపులోని బిడ్డకు నరాలకు సంబంధించిన అభివృద్ధి సరిగ్గా జరగదు. బుద్ధిమాంద్యం లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే పీసీఓఎస్ ఉన్న వాళ్లకు ప్రెగ్నెన్సీలో మధుమేహం రావచ్చు. కాబట్టి, మందులు సరిగ్గా వాడండి. బిడ్డ పుట్టిన మూడోరోజు ‘న్యూబార్న్ స్క్రీనింగ్’ పరీక్ష చేస్తారు. అది కూడా చేయించండి. జన్యుపరంగా ఏమైనా వ్యాధులుంటే తెలిసిపోతుంది. తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు థైరాయిడ్ సమస్యలు, ఇతర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు కనీసం ఆరువారాల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలి. దానివల్ల కొంత ఫలితం ఉంటుంది.
– డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
మహిళా పాఠకులు తమ ఆరోగ్య సమస్యలను zindagi@ntnews.comకు మెయిల్ చేయవచ్చు.