Lemon Peel | నిమ్మకాయలను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మకాయల నుంచి రసాన్ని తీసి వాడుతుంటాం. దీన్ని కొందరు నేరుగా తాగుతారు. లేదా రకరకాల పానీయాల్లో కలిపి తాగుతారు. అలాగే వంటల్లోనూ వేస్తుంటాం. నిమ్మరసం తీసిన తరువాత నిమ్మ తొక్కలను పడేస్తుంటారు. కానీ నిమ్మతొక్కల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నిమ్మతొక్కలను ఎండబెట్టి పొడి చేసి దాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తీసుకోవచ్చు. లేదా ఆ పొడితో ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ వంటివి తయారు చేసి కూడా వాడుకోవచ్చు. ఇలా నిమ్మ తొక్కలను వాడడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. నిమ్మతొక్కల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు అనేకం ఉన్నాయి. అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఈ తొక్కల్లో ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి.
నిమ్మతొక్కలో విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, లైమోనీన్, హెస్పెరెడిన్, రుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ తొక్కల్లో అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. నిమ్మతొక్కల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలోని ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించి హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) ను పెంచుతాయి. అలాగే ట్రై గ్లిజరైడ్స్ లెవల్స్ కూడా తగ్గుతాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. నిమ్మతొక్కల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ తొక్కలు ఎంతో మేలు చేస్తాయి. ఈ తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు.
నిమ్మతొక్కల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. నిమ్మతొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. నిమ్మతొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని మీరు రోజూ వాడే పేస్ట్‌లో కలిపి దాంతో దంతాలను తోమితే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
నిమ్మ తొక్కలో డి లైమోనీన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుందని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. నిమ్మ తొక్కలను తరచూ వాడడం వల్ల శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. నిమ్మతొక్కను ఎండబెట్టి పొడిలా చేసి అందులో నీళ్లను కలిపి ముఖానికి వాడితే ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా నిమ్మతొక్కలను వాడితే అనేక లాభాలను పొందవచ్చు.