Corn Silk | మొక్క జొన్నలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఒకప్పుడు ఇవి కేవలం సీజన్లోనే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి సీజన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. మొక్కజొన్నలను చాలా మంది ఉడకబెట్టి లేదా కాల్చి తింటారు. ఎలా తిన్నా కూడా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మొక్కజొన్నలను ఒలిచిన తరువాత కంకులను పడేస్తారు. కానీ వాటికి ఉండే పీచు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అమెరికా, చైనా సంప్రదాయ వైద్య విధానంలో మొక్కజొన్న పీచును కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక పోషకాలతోపాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. మొక్క జొన్న పీచు వల్ల మనకు కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న పీచులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, స్టెరాల్స్, సాపోనిన్స్, అల్లన్టోయిన్, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి. కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చు. శరీరంలోని వాపులు సైతం తగ్గిపోతాయి. మొక్క జొన్న పీచులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ పీచులో ఉండే మెగ్నిషియం వాపులను, నొప్పులను తగ్గిస్తుంది. అందువల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
మొక్కజొన్న పీచు వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. క్లోమ గ్రంథిలో డ్యామేజ్ అయిన బీటా కణాలు మరమ్మత్తులకు గురవుతాయి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం తరచూ మొక్కజొన్న పీచును తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని తేల్చారు. అయితే పీచును నేరుగా తినలేరు కనుక దీన్ని నీటిలో వేసి మరిగించి తాగాల్సి ఉంటుంది. ఈ పీచు సహజసిద్ధమైన డైయురెటిక్‌గా కూడా పనిచేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న ద్రవాలను బయటకు పంపుతుంది. దీంతో పాదాలు, చేతుల్లో ఉండే వాపులు తగ్గిపోతాయి. అలాగే బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పీచు ఎంతో మేలు చేస్తుంది.
మొక్కజొన్న పీచు మూత్రాశయ ఇన్ఫెక్షన్లను సైతం తగ్గిస్తుంది. మూత్రాశయం, జననావయవాల దగ్గర బ్యాక్టీరియా, ఫంగస్ చేరకుండా చూస్తుంది. మూత్రం ధారాళంగా వచ్చేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు మొక్క జొన్న పీచు వేసి మరిగించిన నీళ్లను రోజూ తాగుతుంటే స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ కషాయం ఎంతగానో పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఈ పీచును ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇలా మొక్కజొన్న పీచుతో అనేక లాభాలను పొందవచ్చు.