Coconut Flower | కొబ్బరి బొండాలలోని నీళ్లను చాలా మంది తాగుతుంటారు. అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా ఇష్టంగానే తింటుంటారు. వీటితో కూరలు, పచ్చళ్లు, చట్నీలు, స్వీట్లు చేసుకోవచ్చు. అయితే కొబ్బరికాయను కొట్టినప్పుడు ఒక్కోసారి పువ్వు వస్తుంది. దీంతో అంతా శుభమే జరుగుతుందని కొందరు విశ్వసిస్తారు. అయితే కొబ్బరికాయల్లో ఉండే పువ్వులో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిపువ్వును పడేయకుండా తింటే ఎంతో మేలు జరుగుతుందని వారు అంటున్నారు. కొబ్బరి పువ్వులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. కొబ్బరి పువ్వులో మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
కొబ్బరి పువ్వులో విటమిన్లు సి, బి1, బి3, బి4, బి2, బి10 ఉంటాయి. వీటితోపాటు ఫ్లేవనాయిడ్, పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి పువ్వులో అనేక రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. సహజసిద్ధమైన చక్కెరకు కొబ్బరి పువ్వు పెట్టింది పేరు. ఇది షుగర్ లెవల్స్‌ను అంత త్వరగా పెంచదు. ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. కొబ్బరి పువ్వు తియ్యగా ఉన్నప్పటికీ దీని గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవు. పైగా కొబ్బరి పువ్వులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా కొబ్బరి పువ్వును ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్, గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. కొబ్బరి పువ్వులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. దీన్ని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి పువ్వును తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. విరేచనాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తగ్గిపోతుంది.
కొబ్బరి పువ్వులో ఉండే విటమిన్ సి, బయో యాక్టివ్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. కొబ్బరి పువ్వులో ఉండే పొటాషియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారిస్తాయి. కొబ్బరి పువ్వును తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ పువ్వును తింటుంటే గర్భిణీలకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. శిశువుకు కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఇలా కొబ్బరి పువ్వులను తింటే అనేక లాభాలను పొందవచ్చు.