Raspberries | మార్కెట్లో లభించే అనేక రకాల పండ్లను చాలా మంది తింటుంటారు. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం అసలు పట్టించుకోరు. అలాంటి పండ్లలో రాస్ప్బెర్రీలు కూడా ఒకటి. చూడచక్కని ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా మనకు ఈ పండ్లు దర్శనమిస్తాయి. కానీ ధర ఎక్కువ అనే కారణంగా ఈ పండ్లను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. అయితే ఇవి పోషకాలకు గని అని చెప్పవచ్చు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. రాస్ప్బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 1 కప్పు రాస్ప్ బెర్రీలను తినడం వల్ల 64 క్యాలరీల శక్తి లభిస్తుంది. 14.7 గ్రాముల పిండి పదార్థాలు, 8 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. చక్కెర 5.4 గ్రాములు, ప్రోటీన్లు 1.5 గ్రాములు, కొవ్వు 0.8 గ్రాములు, విటమిన్లు సి, కె, లతోపాటు మాంగనీస్, ఫోలేట్, విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తాయి.
రాస్ప్బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే స్వల్ప మొత్తంలో కొన్ని రకాల బి విటమిన్లను, విటమిన్ ఎ ను కూడా పొందవచ్చు. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం, జింక్, కాపర్, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రాస్ప్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆంథో సయనిన్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఈ పండ్లు ఎరుపు రంగులో ఉంటాయి. రాస్ప్బెర్రీలలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రాస్ప్బెర్రీలలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. రాస్ప్ బెర్రీలు తియ్యగా ఉంటాయి. అయినప్పటికీ ఈ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ అంతగా పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు సైతం ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రాస్ప్ బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
రాస్ప్ బెర్రీలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఈ పండ్లను తింటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మెదడులో వాపులు రాకుండా చూస్తాయి. దీంతో మెదడు కణాలు రక్షించబడతాయి. ఫలితంగా మెదడు యాక్టివ్‌గా మారి చురుగ్గా పనిచేస్తుంది. బద్దకం పోతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. రాస్ప్బెర్రీలు తియ్యగా ఉన్నప్పటికీ అధిక బరువు ఉన్నవారు ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు. ఇవి బరువును తగ్గించేందుకు సహాయం చేస్తాయి. ఈ పండ్లలో ఉండే పైబర్ కారణంగా ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఇలా రాస్ప్బెర్రీలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.