Prunes | సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు లేదా పండ్ల దుకాణాల్లో మనకు అనేక రకాల పండ్లు దర్శనమిస్తుంటాయి. వాటిల్లో ప్రూన్స్ కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తాయి. చూసేందుకు నల్లగా కిస్మిస్ల మాదిరిగా ఉంటాయి. కానీ సైజు కాస్త పెద్దవిగా ఉంటాయి. అయితే ఈ పండ్లను చాలా మంది చూసే ఉంటారు. కానీ ఇవి ఏమిటో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ పండ్లను ప్రూన్స్ అంటారు. ప్లమ్స్‌ను ఎండబెట్టగా వచ్చే డ్రై ఫ్రూట్స్‌నే ప్రూన్స్ అంటారు. ఇవి పోషకాలకు నిలయంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రూన్స్ను ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ప్రూన్స్లో ఉంటాయి. వీటిని రోజూ సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో తినవచ్చు. ఎన్నో లాభాలను పొందవచ్చు.
ప్రూన్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు రకాలు ఇందులో ఉంటాయి. ఇవి పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తాయి. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. ప్రూన్స్లో సహజసిద్ధమైన షుగర్ ఆల్కహాల్ అయిన సార్బిటాల్ అధికంగా ఉంటుంది. ఇది మైల్డ్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. అంటే సుఖ విరేచనం అయ్యేలా చేస్తుందన్నమాట. ప్రూన్స్ను తింటే మలబద్దకం అన్న సమస్యే ఉండదు. ప్రూన్స్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. అలాగే పొటాషియం, బోరాన్, మాంగనీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తాయి. 40 ఏళ్లకు పైబడిన వారు ప్రూన్స్ను తరచూ తింటుంటే ఎముకలు విరిగిపోకుండా దృఢంగా ఉంటాయి.
ప్రూన్స్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో నియోక్లోరోజెనిక్, క్లోరోజెనిక్ యాసిడ్లు, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను తింటే ఫ్రీ ర్యాడికల్స్‌పై పోరాటం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. దీని వల్ల గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. వయస్సు మీద పడడం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ప్రూన్స్లో అధికంగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ప్రూన్స్ తినేందుకు తియ్యగా ఉన్నప్పటికీ ఇవి చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ విలువను కలిగి ఉంటాయి. అందువల్ల ప్రూన్స్ను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ప్రూన్స్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ప్రూన్స్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఇలా ప్రూన్స్తో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. డైటిషియన్లు చెబుతున్న ప్రకారం రోజుకు 4 నుంచి 6 ప్రూన్స్ను తింటున్నా చాలు ఎన్నో లాభాలు కలుగుతాయని అంటున్నారు.