Lakshmana Phalam | మీరు ఎప్పుడైనా లక్ష్మణ ఫలం గురించి విన్నారా..? ఈ పండు మన దేశంతోపాటు కరేబియన్ దీవులు, మధ్య అమెరికాలో ఎక్కువగా పండుతుంది. ఈ చెట్లు 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకుపచ్చ రంగులో హృదయం ఆకారంలో ఈ పండు ఉంటుంది. మీద ముళ్ల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. లక్ష్మణ ఫలం ఆకుపచ్చగా చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పండు తీపి, పులుపు రుచులను కలిగి ఉంటుంది. దీన్ని చాలా మంది చూసి ఉండరు. కానీ కొందరు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. లక్ష్మణ ఫలంలోనూ 119 రకాలకు చెందిన పండ్లు ఉన్నాయి. 100 గ్రాముల లక్ష్మణ ఫలాన్ని తింటే మనకు 81.2 గ్రాముల మేర నీరు లభిస్తుంది. 66 క్యాలరీల శక్తి లభిస్తుంది. చక్కెర 13.5 గ్రాములు, ప్రోటీన్లు 1 గ్రాము, పిండి పదార్థాలు 16.8 గ్రాములు, ఫైబర్ 3.3 గ్రాములు లభిస్తాయి.
లక్ష్మణ ఫలాన్ని తింటే క్యాల్షియం, ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సి కూడా అధికంగానే లభిస్తాయి. అందువల్ల ఈ పండ్లను పోషకాలకు గనిగా చెబుతారు. ఈ పండ్లలో అధిక శాతం నీరే ఉంటుంది. కనుక వేసవిలో ఈ పండ్లను తింటే శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మణ ఫలంలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. దీన్ని తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
లక్ష్మణ ఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశాయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్తి ఉండదు. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. లక్ష్మణ ఫలంలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలోని ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి దోహదం చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. లక్ష్మణ ఫలంలో ఉండే మెగ్నిషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. వ్యాయామం చేసిన వారు, శారీరక శ్రమ చేసిన వారు ఈ పండ్లను తింటే ఒళ్లు నొప్పులు త్వరగా తగ్గుతాయి. రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఉపశమనం లభిస్తుంది.
లక్ష్మణ ఫలంలో ఉండే ఫాస్ఫరస్ ఎముకల సాంద్రతను పెంచుతుంది. దీని వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అలాగే విటమిన్ సి వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి సహజసిద్ధమైన నిగారింపును సొంతం చేసుకుంటుంది. లక్ష్మణ ఫలం క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేయగలదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఈ పండ్లను తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సైతం తగ్గిపోతాయి. ఇలా లక్ష్మణ ఫలం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.