Green Chilli | ఒకప్పుడు మన పూర్వీకులతోపాటు పెద్దలు కూడా పచ్చి మిర్చిని రోజూ తినేవారు. దీన్ని వారు తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకునేవారు. చద్దన్నంలో పచ్చి మిర్చిని నంజుకుని తినేవారు. అయితే పచ్చి మిర్చి వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరైనా దీన్ని ఇష్టంగా తింటారు. ఒకప్పుడు మన పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. అందుకనే వారు ఎంత వయస్సు వచ్చినా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ క్రమంలోనే పచ్చి మిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిర్చి కారంగా ఉంటుందని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపించరు. కూరల్లో వచ్చినా పడేస్తుంటారు. కానీ పచ్చి మిర్చిలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పచ్చి మిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజ పండ్లలో కన్నా పచ్చి మిర్చిలోనే అధికంగా విటమిన్ సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక పచ్చిమిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. పచ్చి మిర్చిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్ల సమస్యలు తగ్గిపోతాయి. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు.
పచ్చి మిర్చిలో విటమిన్ బి6, బి9 అధికంగా ఉంటాయి. ఇవి మన శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఈ విటమిన్ల వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. నరాల బలహీన తగ్గుతుంది. మెడ, భుజాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. రక్తం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. పచ్చిమిర్చిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పచ్చిమిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది థర్మోజెనిక్ గుణాలను కలిగి ఉంటుంది. అంటే శరీర ఉష్ణోగ్రతను కాసేపు పెంచుతుందన్నమాట. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. కాబట్టి పచ్చి మిర్చిని తింటుంటే బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. పచ్చి మిర్చిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. పచ్చి మిర్చిని అధికంగా తింటే కడుపులో మంట వస్తుంది. కానీ మోతాదులో తింటే జీర్ణ క్రియకు సహాయ పడతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇలా పచ్చిమిర్చితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.