Elephant Yam | ప్రకృతిలో మనకు అనేక రకాల దుంపలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దుంప ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వాటిల్లో కంద కూడా ఒకటి. దీన్నే పులగంద అని కూడా అంటారు. ఆంగ్లంలో ఎలిఫెంట్ ఫుట్ లేదా ఎలిఫెంట్ యామ్ అని పిలుస్తారు. దీంతో అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. కంద పులుసు, వేపుడు, టమాటా కూర వంటివి చేసి తింటారు. ఈ దుంప వాస్తవానికి ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీన్ని వండే ముందు బాగా కడగాల్సి ఉంటుంది. మీద ఉండే పొట్టు తీసి బాగా కడిగి అప్పుడే వండాలి. కందను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ దుంపల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అనేక రకాల పోషకాలు లభిస్తాయి.
100 గ్రాముల ఉడకబెట్టిన కందలో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అలాగే సంక్లిష్టమైన పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు బి6, సి, బి9, బి1, బి2, బి3లతోపాటు పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ దుంపల్లో సమృద్ధిగా ఉంటాయి. కందను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. కంద ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. అంటే దీన్ని తింటే మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కందను తింటే అజీర్తి ఉండదు. గ్యాస్ తగ్గిపోతుంది. పైల్స్ ఉన్నవారికి కంద ఎంతగానో మేలు చేస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు కూడా నయమవుతాయి.
కంద గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. పేరుకు దుంప అయినప్పటికీ దీన్ని తింటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవు. పైగా కందలో ఆల్లన్టోయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. దీంతో షుగర్ స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కంద ఎంతగానో మేలు చేస్తుంది. కందలో అధికంగా ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కందలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో సోడియం స్థాయిలను నిర్వహిస్తాయి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి కంద ఎంతగానో మేలు చేస్తుంది.
పేరుకు దుంప అయినప్పటికీ కందను తింటే చాలా తక్కువగా క్యాలరీలు లభిస్తాయి. పైగా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల కందను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. కందను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. కందలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. వీటి వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కందను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే నొప్పుల నుంచి బయట పడవచ్చు. కందలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా కందతో మనం అనేక లాభాలను పొందవచ్చు.