Cabbage | క్యాబేజీ అంటే చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. క్యాబేజీతో మనం పప్పు, వేపుడు, పచ్చడి వంటివి చేస్తుంటాం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో క్యాబేజేని అధికంగా ఉపయోగిస్తారు. క్యాబేజీతో సూప్ తయారు చేసి తాగవచ్చు. అయితే క్యాబేజీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు క్యాబేజీలో ఉంటాయి. క్యాబేజీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీతో సూప్ తయారు చేసి ఒక కప్పు మోతాదులో ఉదయం సేవించవచ్చు. లేదా ఒక కప్పు మోతాదులో క్యాబేజీ జ్యూస్‌ను కూడా తాగవచ్చు. క్యాబేజీని బాగా శుభ్రం చేసిన తరువాత మాత్రమే జ్యూస్ లేదా సూప్ తయారు చేసుకుని తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
క్యాబేజీలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినసప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. విటమిన్ కె ఎముకలను దృఢంగా మారుస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియో పోరోసిస్ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. సులభంగా విరిగిపోకుండా చూసుకోవచ్చు. క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
క్యాబేజీలో ఫోలేట్ (విటమిన్ బి9) అధికంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణం, అభివృద్ధికి దోహదం చేస్తుంది. డీఎన్ఏ కు తోడ్పడుతుంది. ఎర్ర రక్త కణాలు తయారు అయ్యేలా చేస్తుంది. దీంతో గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుంది. శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పుట్టుక లోపాలు రాకుండా నివారించవచ్చు. క్యాబేజీలో విటమిన్ బి6, బి1, బి3 స్వల్ప మొత్తాల్లో ఉంటాయి. విటమిన్ బి6 వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. క్యాబేజీలో మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, ఐరన్, ఫాస్ఫరస్ తదితర మినరల్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో అనేక విధులు సక్రమంగా నిర్వహించబడేందుకు దోహదం చేస్తాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. రోగాలు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
క్యాబేజీలో ఆంథో సయనిన్స్, ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాబేజీలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. క్యాబేజీని తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి బయట పడవచ్చు. క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అల్సర్లు నయం అవుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. క్యాబేజీలను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. ఇలా క్యాబేజీ వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.