Black Cumin | జీలకర్రను మనం ఎప్పటి నుంచో వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నాం. జీలకర్రను నిత్యం అనేక వంటల్లో వేస్తుంటారు. జీలకర్రను కూరల్లో వేస్తే కూరలు చక్కని వాసన వస్తాయి. రుచిగా కూడా ఉంటాయి. అయితే జీలకర్రలో మరో రకం జీలకర్ర కూడా ఉంటుంది. అదే నల్ల జీలకర్ర. దీన్ని చాలా మంది చూసి ఉండరు. కానీ నల్ల జీలకర్రను కూడా మనం ఉపయోగించవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. నల్ల జీలకర్రను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో ఉదయం తాగుతుండాలి. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. థైమోక్వినోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వీటిల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తుంది. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
నల్ల జీలకర్రలో అధికంగా ఉండే థైమోక్వినోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల ఈ జీలకర్రను వేసి మరిగించిన నీళ్లను రోజూ సేవిస్తుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. నల్ల జీలకర్రలో ఇమ్యునో మాడ్యులేటరీ గుణాలు ఉంటాయి. అంటే దీన్ని తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. నల్ల జీలకర్రలో ఉండే సమ్మేళనాలు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. నల్ల జీలకర్రను తీసుకుంటే అలర్జీలను సైతం తగ్గించుకోవచ్చు. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా లభిస్తుంది. ఊపిరి సరిగ్గా పీల్చుకుంటారు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల జీలకర్ర ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి నల్ల జీలకర్ర ఎంతగానో మేలు చేస్తుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల జీలకర్రను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతోపాటు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. సైంటిస్టులు జంతువులపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. నల్ల జీలకర్ర నుంచి తీసిన నూనె కూడా మనకు లభిస్తుంది. దీన్ని వాడడం వల్ల అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మొటిమలు, గజ్జి, తామర, దురద, సోరియాసిస్ వంటి సమస్యలకు ఈ నూనె చక్కగా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లను త్వరగా మానేలా కూడా చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం నల్ల జీలకర్ర నూనె జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. శిరోజాలకు దీన్ని రాస్తుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారుతాయి. ఇలా నల్ల జీలకర్రను వాడితే అనేక లాభాలను పొందవచ్చు.