Doosara Theega | మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉంటాయి. కానీ అలాంటి మొక్కల గురించి చాలా మందికి తెలియదు. వాటిని చూసి చాలా మంది పిచ్చి మొక్కలుగా భావిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్రకారం ఆయా మొక్కలు అద్భుతమైన ఔషధ విలువలను కలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో దూసర తీగ మొక్క కూడా ఒకటి. ఇది తీగ జాతికి చెందినది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనూ బాగా పెరుగుతుంది. బాగా పరిశీలిస్తే దీన్ని మనం గమనించవచ్చు. ఈ మొక్కల తీగ జాతికి చెందినది కనుక పొదలపై అల్లుకుంటుంది. కనుక గుర్తించడం కూడా సులభమే. దూసర తీగ మొక్కలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో చేలు, పొలాల గట్ల మీద పెరుగుతాయి. ఈ మొక్కను మనం ఇంట్లోనూ పెంచుకోవచ్చు. ఇది మనకు అనేక లాభాలను అందిస్తుంది. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు సహాయం చేస్తుంది.
దూసర తీగ మొక్క ఆకులు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కళ్ల మంట, కళ్ల దురద, కంటి రెప్పలపై కురుపులు వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ఆకులు మేలు చేస్తాయి. దూసర తీగ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని బాగా దంచి రసం తీయాలి. అనంతరం ఆ రసాన్ని కను రెప్పలపై రాయాలి. రోజూ రాత్రి పూట ఇలా చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే కళ్లను గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా కనీసం వారం రోజుల పాటు చేస్తే అన్ని రకాల కంటి సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే దూసర తీగ ఆకుల గుజ్జును రాస్తుంటే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మంపై దురద, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు, ఎరుపుదనం, గజ్జి, తామర వంటి సమస్యలు తొలగిపోతాయి. దూసర తీగ ఆకులను దంచి గుజ్జుగా చేసి రాస్తుంటే ఆయా సమస్యలు తగ్గిపోతాయి.
శరీరంలో అధికంగా వేడి ఉన్నవారికి కూడా ఈ మొక్క ఆకులు పనిచేస్తాయి. ఇందుకు గాను దూసర తీగ ఆకులను దంచి రసం తీయాలి. ఆ పసరును ఒక గ్లాస్లో వేసి సుమారుగా 5 గంటల పాటు అలాగే ఉంచాలి. దీంతో అది జెల్ మాదిరిగా మారుతుంది. అందులో కాస్త పటిక బెల్లం కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని తినాల్సి ఉంటుంది. ఇలా రెండు రోజులకు ఒకసారి తింటుండాలి. దీని వల్ల శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది. వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయి. శరీరం చల్లగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అలాగే ఎల్లప్పుడూ వేడి శరీరం ఉండేవారు కూడా ఈ చిట్కాను పాటించవచ్చు. దీంతో ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. శరీరం హాయిగా అనిపిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి కూడా దూసర తీగ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. గుప్పెడు దూసర తీగ ఆకులను తీసుకుని ఒక పాత్రలో వేసి అందులో కొద్దిగా నీరు పోసి బాగా మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. భోజనానికి 30 నిమిషాల ముందు ఆ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దూసర తీగ ఆకుల రసాన్ని రోజూ అర టీస్పూన్ మోతాదులో సేవిస్తుంటే స్త్రీలు, పురుషుల్లో ఉండే హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి. ఇలా దూసర తీగ ఆకులు మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. అయితే ఈ ఆకులు అందరికీ పడవు. కనుక వైద్యుల పర్యవేక్షణలో వీటిని వాడుకోవాల్సి ఉంటుంది.