Fasting | ముస్లింలు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో చాలా సైన్స్ దాగి ఉంది. అలాగే హిందువులు కూడా వారంలో తమకు ఇష్టమైన రోజు లేదా ఇష్టదైవానికి పూజ చేసిన రోజు ఉపవాసం చేస్తుంటారు. చాలా మంది సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉపవాసాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు, సైన్స్ పరంగా కూడా అనేక విషయాలు దాగి ఉన్నాయి. ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడమే ఇందులో ఉన్న ఉద్దేశం. అందుకనే మన పెద్దలు కచ్చితంగా వారం వారం ఉపవాస నియమాలను పాటించేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండే వారు. ఇక సైన్స్ కూడా వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే అనేక లాభాలు ఉంటాయని చెబుతోంది. అయితే వారంలో ఒక రోజు కాకుండా వారంలో 2 రోజుల పాటు ఉపవాసం చేస్తే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
వారంలో కనీసం రెండు రోజుల పాటు ఉపవాసం చేస్తుంటే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. 3 రోజులకు ఒకసారి ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం మూడు రకాలుగా చేయవచ్చు. పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేసి కేవలం ద్రవాలను మాత్రమే తీసుకోవడం. కేవలం రెండు పూటలు మాత్రమే అది కూడా అల్పాహారం లేదా పండ్లను మాత్రమే తినడం లేదా ఒక పూట తినడం, మిగిలిన రెండు పూటలు ద్రవాహారం తీసుకోవడం.. ఇలా ఉపవాసాన్ని ప్రధానంగా మూడు రకాలుగా చేయవచ్చు. ఉపవాసం చేయడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారికి ఉపవాసం ఎంతో మేలు చేస్తుంది.
డయాబెటిస్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉపవాసం చేయవచ్చు. తరచూ వారు ఉపవాసం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే ఇది మేలు చేస్తుంది. ఇక ఉపవాసం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రాత్రిపూట నిద్ర చక్కగా పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. వారంలో రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటే శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. పాడైన లేదా చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పలు అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఉపవాసం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల గుండె సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. వారంలో రెండు రోజుల పాటు ఉపవాసం ఉంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఉపవాసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉపవాసం చేయాలని సూచిస్తున్నారు.