Diet For Fatty Liver Disease | మన శరీరంలో అంతర్గతంగా ఉండే అతి పెద్ద అవయవం.. లివర్. ఇది అనేక ముఖ్య పనులను నిర్వర్తిస్తుంది. అయితే కాలక్రమేణా లివర్‌లో కొవ్వు, వ్యర్థాలు చేరుతుంటాయి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీని వల్ల శరీరం పలు సంకేతాలను మనకు తెలియజేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అస్తవ్యస్తమైన జీవన విధానాన్ని పాటించడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, మద్యం ఎక్కువగా సేవించడం, మందులను దీర్ఘకాలికంగా వాడడం వంటి పలు కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే ఇది రెండు రకాలుగా ఉంటుంది. మద్యం సేవించడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌ను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని, అలా కాకుండా సాధారణంగా వచ్చే సమస్యను నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. ఏది వచ్చినా సరే కచ్చితంగా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
అధికంగా బరువు ఉండడం, ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండడం, టైప్ 2 డయాబెటిస్, రక్తంలో కొవ్వులు అధిక స్థాయిలో ఉండడం, మెటబాలిక్ వ్యవస్థ పనితీరు మందగించడం, పలు రకాల మందులు, వంశ పారంపర్యత వంటి కారణాల వల్ల కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సమస్య వస్తే డాక్టర్ ఇచ్చిన మందులతోపాటు ఆహారం విషయంలో చాలా మార్పులు చేసుకోవాలి. పలు రకాల ఆహారాలను తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు లివర్‌ను క్లీన్ చేస్తాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తింటుండాలి. ఇవి లివర్ కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ ఆహారం తికుండా ఉంటారు. దీని వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఫలితంగా లివర్‌పై పడే భారం తగ్గుతుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ నుంచి బయట పడవచ్చు. పాలకూర, కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, యాపిల్స్, నిమ్మ, నారింజ, ద్రాక్ష, టమాటాలు, క్యాప్సికం, క్యారెట్లు, బీట్రూట్ వంటి పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ నుంచి బయట పడవచ్చు.
ఓట్స్, బ్రౌన్ రైస్, కినోవా, పాస్తా, హోల్ వీట్ బ్రెడ్, బార్లీ, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి నిరంతరం శక్తిని అందిస్తాయి. షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చేస్తాయి. దీంతో లివర్‌పై పడే భారం తగ్గి లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. అదేవిధంగా చేపలు, చికెన్ (స్కిన్లెస్), పప్పు దినుసులు, బ్లాక్ బీన్స్, శనగలు, రాజ్మా, పనీర్, కోడిగుడ్లు, కొవ్వు తీసిన పాలు వంటి ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇవన్నీ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా, చియా విత్తనాలు, అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా ఆహారంలో మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ నుంచి సులభంగా బయట పడవచ్చు.