Diabetics @ Stroke | శరీరంలోని చక్కెరలను సమతుల్యం చేసి అవసరానికి అందుబాటులో ఉంచేలా చేయడంలో ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఇన్సులిన్ తగ్గిపోయినట్లయితే లేదా ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణాలు సరిగా వినియోగించుకోని పక్షంలో మధుమేహం వస్తుంది. మధుమేహం సమస్య ఒక్కసారి మనలో మొదలైందంటే ఇక అది మనతోనే ఉంటుంది. షుగర్ సమస్య ఉన్న వారిలో మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, కంటిలోని నరాలు, రక్తనాళాలు, కాళ్లు, పాదాల నరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మధుమేహులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం, ఇతరులతో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులు స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీరికి చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నియంత్రణ లేని మధుమేహం.. స్ట్రోక్, ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.
మధుమేహం – స్ట్రోక్ మధ్య సంబంధం..
మనం ఏదైనా తిన్నప్పుడు అది గ్లూకోజ్‌గా విడిపోయి శరీర పనితీరుకు శక్తిని విడుదల చేస్తుంది. ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారినప్పుడు అది రక్తం ద్వారా మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది. గ్లూకోజ్ కణానికి చేరేందుకు, శక్తిని విడుదల చేసేందుకు ఇన్సులిన్ హార్మోన్ అవసరం. టైప్-1 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను అస్సలు ఉత్పత్తి చేయదు.
టైప్-2 డయాబెటిస్‌లో ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీర కణాలు సరిగా ఉపయోగించుకోలేవు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ అధికంగా చేరుతుంది. గ్లూకోజ్ రక్తప్రవాహంలో విడుదలవుతూ పేరుకుపోతున్నా అది శక్తిగా మార్చబడదు. నిర్వహణలేని మధుమేహం లేదా రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు రక్త నాళాలు మూసుకుపోయేలా చేస్తాయి. గడ్డకట్టడం, కొవ్వు నిల్వలను పెంచుతాయి.
ప్రమాదాన్ని ఇలా తగ్గించుకుందాం..
మధుమేహాన్ని మేనేజ్ చేయడానికి ముందుగా గుండె ఆరోగ్యకర ఆహారాలపై దృష్టిపెట్టాలి. నిత్యం తీసుకునే ఆహారాల్లో అధిక ఫైబర్, తక్కువ కొవ్వులు కలిగి ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి.
అధిక బరువు, ఊబకాయం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకని మధుమేహులు తమ శరీరం బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన బాడీ మాస్ఇండెక్స్ను మెయింటేన్ చేయాలి.
శారీరకంగా చురుకుగా ఉండేందుకు నిత్యం 30 నిమిషాల నడక లేదా జిమ్ సెషన్ లేదా స్విమ్మింగ్ లేదా రోప్ స్కిప్పింగ్ చేస్తుండాలి. ప్రతి రోజూ ఏదో ఒక విధమైన శారీరక శ్రమ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే సరైన వ్యాయామం కోసం వైద్యుడిని సంప్రదించి సలహాలు పొందాలి.
సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానుకోవాలి. ఇవి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. మధుమేహం ఉన్నవారిలో ప్రాణాంతకం అయ్యే అవకాశాలున్నాయి. అందుకని సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్‌కు ఇవాళే స్వస్తి చెప్పండి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.