కోల్‌కత, ఆగస్టు 29: దుర్గామాత పూజను ఎలా జరుపుకోవాలన్న విషయంలో విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) పశ్చిమ బెంగాల్లో సరికొత్త చర్చకు తెర లేపింది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో దుర్గా పూజ నిర్వాహకులు, పూజారులు, దుర్గోత్సవ్ వేదిక సభ్యులు పాల్గొన్న ఒక చర్చా కార్యక్రమంలో వీహెచ్‌పీ దుర్గా పూజ నిర్వహణపై మార్గదర్శకాలను జారీచేసింది. ఉత్సవాల్లో థీమ్‌ల పేరుతో విగ్రహాల రూపకల్పనను వికృతీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పూజా మండపాల ఆవరణలో మాంసాహారాన్ని నిషేధించాలని కోరింది. గతంలో దుర్గాదేవిని వితంతువుగా చిత్రీకరించిన థీమ్‌లను, మండపాల ఆర్ట్‌వర్క్‌లో బూట్లు, పగిలిన గాజు ముక్కలను ఉపయోగించడం తగదని తెలిపింది. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలకు ఫొటోలు తీయవద్దని సందర్శకులకు విజ్ఞప్తి చేసింది. సంప్రదాయ నిబంధనలు పాటించే పూజా కమిటీలు, పూజారులకు ప్రత్యేక గౌరవ పురస్కారాలు అందజేస్తామని ఫోరమ్ ఫర్ దుర్గోత్సవ్ ప్రకటించింది.
మాంసాహారం తింటారని తెలిసే..
దుర్గాపూజోత్సవంలో మహా అష్టమి నాడు భక్తులు మాంసాహారాన్ని తింటారని తెలిసే వీహెచ్‌పీ ఈ నిషేధాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పండుగ రోజుల్లో అన్ని పందిళ్ల వెలుపల ఆహార దుకాణాలు వెలుస్తాయి. మండపాలకు వచ్చే వారంతా రోడ్లపైనే తినడం, తాగడం చేస్తుంటారు. చేతిలో ఎగ్‌రోల్స్ పట్టుకుని పందిళ్లను సందర్శిస్తుంటారు. అయితే అమ్మవారికి అందించే ‘భోగ్’ శాకాహారమే అయి ఉంటుంది. ఏండ్ల తరబడి ఇదే తీరులో ఉత్సవాలు జరుగుతుండగా, ఇప్పుడు వీహెచ్‌పీ ఆంక్షలు విధించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నాకనే ఆంక్షల విషయంపై ఆలోచించాలని వీహెచ్‌పీకి పలువురు సూచిస్తున్నారు. బెంగాలీలు దుర్గా పూజను ఎలా జరుపుకోవాలో నిర్ణయించే అధికారాన్ని వీహెచ్‌పీ తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నదని, తద్వారా పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయాలని చూస్తోందని, సీపీఐ(ఎం) శనివారం తీవ్ర స్థాయిలో మండిపడింది. దుర్గా పూజ ఉత్సవాన్ని నాశనం చేయడానికి వీహెచ్‌పీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.