ఆదిలాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. శనివారం బోథ్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌పై బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అసమర్థులకు పార్టీ, నామినేటెడ్ పదవులు ఇవ్వడంతోపాటు జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోవడంలో విఫలమయ్యారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.