Dark Circles | ప్రస్తుత తరుణంలో చాలా మందికి డార్క్ సర్కిల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఆఫీసుల్లో పని ఒత్తిడి అధికంగా ఉండడంతోపాటు రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం.. ఈ రెండింటినీ డార్క్ సర్కిల్స్ వచ్చేందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే కళ్ల కింద నల్లని వలయాలు వస్తే చాలా మంది అనేక రకాల మార్గాలను ఇప్పటికే అనుసరించి ఉంటారు. ఖరీదైన చికిత్సలను కూడా ప్రయోగించి ఉంటారు. కానీ ఏవి వాడినా ఉపయోగం లేనట్టయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఓ చిట్కాను పాటించండి. దీంతో కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు.
కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి మీరు ఒక పేస్ట్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. దీన్ని కళ్ల కింద అప్లై చేస్తే చాలు వారం రోజుల్లోనే కచ్చితంగా మీకు తేడా కనిపిస్తుంది. ఇక ఈ చిట్కాలో వాడే పదార్థాలు రెండు కూడా సహజసిద్ధమైనవే. అందువల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ భయం కూడా లేదు. ఇక ఈ చిట్కాకు ఏమేం పదార్థాలు కావాలో, దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్ల కింద నల్లని వలయాలను తగ్గించుకోవడం కోసం మీకు కేవలం రెండే రెండు పదార్థాలు అవసరం అవుతాయి. ఒకటి జాజికాయ, రెండు ఆముదం. ఎన్నో వేల ఏళ్ల నుంచే జాజికాయను ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు. జాజికాయలను ఆరోగ్యం కోసమే కాకుండా అందం కోసం కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. జాజికాయల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. జాజికాయల్లో టానిన్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని టైట్‌గా మారుస్తాయి. దీంతోపాటు డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తాయి. అలాగే ముఖంపై ఉండే నల్లని మచ్చలను కూడా తొలగిస్తాయి.
ఇక ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి కాంతిని ఇస్తుంది. చర్మం కింద రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే కళ్ల కింద ఏర్పడే వాపులను తగ్గించడంతోపాటు డార్క్ సర్కిల్స్‌ను నయం చేస్తుంది. ఇక ఈ రెండు పదార్థాలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక రాయి తీసుకుని దాని మీద కొద్దిగా ఆముదం వేయాలి. అనంతరం అందులో జాజికాయను ఉంచి గంధం అరగదీసినట్లు తీయాలి. తరువాత ఏర్పడే మిశ్రమాన్ని సేకరించి కళ్ల కింద నల్లని వలయాలపై రాయాలి. 15 నిమిషాలు ఆగాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. అయితే మంచి ఫలితాలు రావాలంటో ఈ చిట్కాను వారంలో కనీసం 3 సార్లు అయినా ఉపయోగించాలి. అలాగే రాత్రి పూట ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేసి ఉదయం కడిగేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది.
ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించుకోవచ్చు. ఈ మిశ్రమం ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలకు కూడా పనిచేస్తుంది. దీన్ని రాస్తుంటే నల్లని మచ్చలు కూడా తగ్గుతాయి. అయితే ఈ చిట్కాను పాటించడంతోపాటు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రించడం, ఫోన్ లేదా కంప్యూటర్, టీవీ వంటి వాటిని తక్కువగా ఉపయోగించడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి సూచనలు పాటిస్తే ఇంకా త్వరగా డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.