Dark Chocolate Benefits | చాక్లెట్లు అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది వాటిని ఇష్టంగా తింటారు. అయితే చాక్లెట్లలో అనేక రకాలు ఉంటాయి. కానీ డార్క్ చాక్లెట్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిల్లో కొకొవా అధికంగా ఉంటుంది. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాంటి చాక్లెట్లను తింటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. పలు విటమిన్లు, మినరల్స్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక డార్క్ చాక్లెట్లను తరచూ తింటే ఆరోగ్య పరమైన లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. డార్క్ చాక్లెట్లను తింటే అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాల్స్ అనబడే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తనాళాలను ప్రశాంత పరుస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా బీపీ తగ్గుతుంది. దీని వల్ల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె పోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్లను తరచూ తినే వారిలో గుండె పోటు వచ్చే చాన్స్ 37 శాతం వరకు తక్కువగా ఉంటుందని తేల్చారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 29 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. కనుక డార్క్ చాక్లెట్లను తరచూ తింటుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డార్క్ చాక్లెట్లను తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. డార్క్ చాక్లెట్లలో ఉండే కొకొవా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చారు. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయని వారు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి డార్క్ చాక్లెట్లు ఎంతో మేలు చేస్తాయని వారు అంటున్నారు. వీటిని తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
డార్క్ చాక్లెట్లు ప్రీ బయోటిక్ ఆహారం జాబితాకు చెందుతాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. డార్క్ చాక్లెట్లను తింటే మూడ్ మారుతుంది. ఒంటరితనం ఫీల్ అయ్యే వారు డార్క్ చాక్లెట్లను తింటే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి నుంచి బయట పడవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్లను తింటే డిప్రెషన్ బారిన పడిన వారిలో 85 శాతం మేర ప్రభావం చూపిస్తాయని తేలింది. కనుక మూడ్ బాగా లేనివారు, ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు డార్క్ చాక్లెట్లను తింటుండాలి. ఇక వీటిని తింటే శరరీంలో న్యూరాన్లు సైతం యాక్టివ్ అవుతాయి. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది. ఇలా డార్క్ చాక్లెట్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.