Daily One Spoon Ghee | భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని ఉపయోగిస్తున్నారు. చిన్నారులకు నెయ్యిని ఎక్కువగా పెడుతుంటారు. దీని వల్ల వారికి పోషకాలు, బలం అందుతాయని భావిస్తారు. అది నిజమే. అయితే నెయ్యిని పూర్వకాలంలో అందరూ తినేవారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం చిన్నారులకే పెడుతున్నారు. అయితే నెయ్యిని అందరూ తినాల్సిందే. ముఖ్యంగా రోజూ ఒక టీస్పూన్ మోతాదులో అయినా సరే నెయ్యిని తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. నెయ్యిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే రోజూ ఒక టీస్పూన్ నెయ్యి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 సంవత్సరాల మధ్య విస్తృతంగా ఉపయోగించినట్లు చరిత్ర చెబుతోంది. అందువల్ల నెయ్యి దివ్యౌషధమని చెప్పవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. నెయ్యిని కూరల్లో వేసి తినడం వల్ల కూరలు చక్కని రుచిని పొందుతాయి. దీంతో పిల్లలే కాదు, పెద్దలు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు. ఇక నెయ్యి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం ఉన్నవారు రోజూ ఒక టీస్పూన్ నెయ్యి తింటే ఫలితం ఉంటుంది. ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది.
ఇక మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోవడంలో నెయ్యి అద్భుతంగా పని చేస్తుంది. నెయ్యిలో విటమిన్లు ఎ, డి, ఇ, కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనల్ని రోగాలు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా నెయ్యిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. విటమిన్ డి ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే విటమిన్ ఇ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యి వల్ల మనకు విటమిన్ కె లభిస్తుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. ఇలా నెయ్యి వల్ల బహు విధాలుగా మనకు ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో నెయ్యిని తింటే మన శరరీంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డీఎల్ పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారికి నెయ్యి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది అతిగా ఆహారం తినకుండా చూస్తుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. నెయ్యిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. ఇలా నెయ్యిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తినడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు.
అయితే నెయ్యి ఆరోగ్యకరమే అయినప్పటికీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఎవరైనా సరే నెయ్యిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో నిరభ్యంతరంగా తినవచ్చు. నెయ్యిని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.