Covid-19 Vaccine | కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చి చాలా రోజులే అయ్యింది. ప్రభుత్వాల చొరవ పుణ్యమాని జనాభాలో అధికశాతం వ్యాక్సిన్ రక్షణ అందుకున్నారు. కొందరు మాత్రం ఇంకా టీకాకు దూరంగానే ఉంటున్నారు. వాళ్లందరినీ ఊరించే వార్త ఇది. కొవిడ్ టీకా వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడినట్టు అమెరికా పరిశోధకులు పేర్కొంటున్నారు. టీకా వేయించుకోనివారిలో సహజంగానే వైరస్పట్ల భయం ఉంటుంది. కొవిడ్ బారినపడితే తమ పరిస్థితి ఏమిటి, ఆసుపత్రి ఖర్చులు ఎలా?.. ఇలా సవాలక్ష ప్రతికూల ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఇందుకు విరుద్ధంగా టీకా వేసుకున్న వారిలో కొంత ధీమా ఉంటుంది. ఒకవేళ తమకు కొవిడ్ సోకినా, అంత తీవ్రతరం కాకపోవచ్చనే అభయం ఉంటుంది. ఈ కారణం చేతనే, ఇరు పక్షాల మానసిక ఆరోగ్యాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపించిందట. ఎనిమిది వేల మందికి పైగా పౌరుల నుంచి వివరాలు సేకరించాక తేల్చిన విషయమిది!