Butter | గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే చాలా మంది దగ్గర పశువులు ఉంటాయి కనుక వారి దగ్గర ఎల్లప్పుడూ పెరుగు, వెన్న, నెయ్యి, పాలు వంటి ఆహారాలకు కొదువ ఉండదు. ముఖ్యంగా చాలా మంది అప్పటికప్పుడు తయారు చేసిన సహజసిద్ధమైన వెన్నను తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తారు. అన్నంలో నెయ్యి కన్నా వెన్న కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలకు వెన్నను కూడా పెడుతుంటారు. అయితే వెన్నను తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా మనకు వెన్న అనేక ప్రయోజనాలను, పోషకాలను అందిస్తుంది. గేదె లేదా ఆవు పాలతో తయారు చేసిన వెన్నను ఉపయోగించవచ్చు. వెన్నలో 20 నుంచి 25 శాతం వరకు నీరు ఉంటుంది. వెన్నను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
వెన్నలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, డి, ఇ, కె2లతోపాటు అనేక మినరల్స్ కూడా ఉంటాయి. వెన్నలో ఉండే బ్యుటిరేట్ అనే సమ్మేళనం మానసిక వ్యాధులను తగ్గిస్తుంది. కనుక వెన్నను తింటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢంగా నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. వెన్నను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ఉదయం దీన్ని తింటే రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. దీంతో ఎంత పనిచేసినా అలసట, నీరసం ఉండవు. యాక్టివ్గానే ఉంటారు. బద్దకం పోతుంది. వెన్నలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు కొన్ని సార్లు పేగులు వాపులకు గురవడం వల్ల కూడా జరుగుతుంది. అలాంటప్పుడు వెన్నను తింటే ఫలితం ఉంటుంది.
వెన్న గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెన్నలో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది గుండెను రక్షిస్తుంది. చాలా మంది వెన్నను తింటే కొవ్వు పెరుగుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. వెన్నను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పరిమిత మోతాదులో తినాలి. అతిగా తినకూడదు. అలాగే వెన్న తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. స్థూలకాయం ఉన్నవారికి వెన్న ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవచ్చు. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ల నుంచి రక్షణను అందిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి.
వెన్నలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా చర్మ సమస్యలు ఉన్న చోట వెన్నను రాస్తుంటే త్వరగా ఉపశమనం లభించి గాయాలు, పుండ్లు, దురదలు వంటివి తగ్గుతాయి. వెన్నను తరచూ తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. వెన్నలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఎ కూడా ఇందులో అధికంగానే ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇలా వెన్నను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వెన్న ఆరోగ్యకరమే అయినప్పటికీ కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు దీన్ని తీసుకోవాలి.